బ్యాటరీ వాహనం ఇప్పించండమ్మా..
నల్లగొండ : ‘చేత్తో తిప్పే రిక్షా, ట్రై సైకిల్‌తో చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. మాకు బ్యాటరీ వాహనం ఇప్పించి ఆదుకోండి’ అంటూ పలువురు దివ్యాంగులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి విన్నించారు. ఎటూ వెళ్లలేని స్థితిలో ఉన్న మాకు బ్యాటరీ వాహనం ఇప్పిస్తే.. ఏదో ఒక పని చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వినతులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మరో విడత వచ్చే వాహనాల్లో ప్రాధాన్యం ఇస్తామని వారితో చెప్పారు.
పథకాలపై అవగాహన కల్పించాలి
సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వివిధ బ్యాంకుల్లో ప్రజలు, ప్రభుత్వ శాఖలు నిర్వహించని బ్యాంకు అకౌంట్లలో సుమారు రూ.66 కోట్లు ఉన్నాయని ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.20 కోట్లు ఉండగా మిగతావి ప్రజలకు సంబంధించినవని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. యూరియా పంపిణీలో వివాదాలు రాకుండా మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. పత్తి కొనుగోలుకు ఏర్పాటు చేసిన యాప్‌లో సమస్యలు రాకుండా చూడాలన్నారు. జిల్లాకు త్వరలో రవాణ శాఖ కమిషనర్ వస్తారని.. చిట్యాల అండర్ పాస్, రోడ్డు ప్రమాదాలపై సమీక్షిస్తారని తెలిపారు. దేవరకొండ, పెద్దవూర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈసీఐఎల్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఆల్ట్రా సౌండ్ మిషన్లు, దివ్యాంగులకు పంపిణీ చేసిన ట్రైసైకిళ్లు తదితర అంశాలపై వివరాలు సేకరించారు.
ఫ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు దివ్యాంగుల వినతి
బ్యాటరీ వాహనం ఇప్పించండమ్మా..
బ్యాటరీ వాహనం ఇప్పించండమ్మా..


