సాఫ్ట్‌వేర్ లోపం.. పత్తి రైతుకు శాపం
పంట మొత్తం కొనుగోలు చేయాలి
నిబంధనల మేరకు కొనుగోలు చేస్తాం
ఫ కపాస్ కిసాన్ యాప్‌లో పత్తి క్వింటాళ్ల నమోదులో తేడాలు
ఫ యాప్‌లో చూపించకపోతే కొనుగోలు చేయలేమన్న సీసీఐ కేంద్రం నిర్వాహకులు
ఫ చిట్యాలలో ఆందోళనకు దిగిన రైతులు
చిట్యాల : కష్టపడి పండించిన పత్తి పంటలను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి అమ్మకానికి తీసుకొచ్చిన పత్తి పంటను సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా క్వింటాళ్ల నమోదులో తేడాలు వచ్చాయి. దీంతో కొనుగోలు చేయలేమని సీసీఐ కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో చేసేది లేక పత్తి రైతులు చిట్యాలలో సోమవారం ఆందోళనకు దిగారు. పత్తి రైతులంతా కలిసి చిట్యాల–ఉరుమడ్ల రహదారి వెంట ఉన్న పత్తి మిల్లు ఎదుట ధర్నా చేశారు.
యాప్ నమోదులో తేడాలు..
నల్లగొండ జిల్లాలోని మునుగోడు, నల్లగొండ మండలాలకు చెందిన వందాలాది రైతులు తాము పండించిన పత్తి పంటలను అమ్ముకునేందుకుగాను కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవడంతో చిట్యాలలోని కృష్ణా కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రానికి కేటాయించారు. దీంతో సోమవారం సుమారు 175 మందికి పైగా పత్తి రైతులు పత్తిని మిల్లుకు తీసుకొచ్చారు. స్లాట్‌బుక్ చేసే సమయంలో ఎకరాకు 10 క్వింటాళ్లకుపైగా పత్తిని అమ్ముకునేందుకు స్లాట్‌బుక్ అయ్యింది. సోమవారం సీసీఐ కేంద్రంలో విక్రయానికి వచ్చే సమయానికి ఎకరాకు 4 క్వింటాళ్ల పత్తిని విక్రయించేందుకుగాను యాప్‌లో చూపిస్తోంది. యాప్‌లో చూపించిన మేరకే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ కేంద్రం నిర్వాహకులు చెప్పారు. దీంతో కపాస్ కిసాన్ యాప్‌లో తాము మొదటగా స్లాట్‌బుక్ నమోదు చేసుకున్నప్పుడు నమోదైన పత్తిని కొనుగోలు చేయాలని రైతులు అందోళనకు దిగారు. చిట్యాల–ఉరుమడ్ల రోడ్డులో కాటన్ మిల్లు ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
ఐదు రోజుల్లో రెండుసార్లు..
యాప్‌లో ఏర్పడిన సాఫ్ట్‌వేర్ లోపంతో ఐదు రోజుల్లో రెండుమార్లు రైతులు ఇబ్బందులు పడ్డా.. సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి పత్తిని తీసుకొచ్చి తిరిగి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు.. అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ధర్నాలో పాల్గొన్న సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్.. సీసీఐ ఏరియా మేనేజర్ మున్షికి ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. అయితే యాప్‌లో వచ్చిన దానికి అదనంగా ఐదు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
చిట్యాలలో కిసాన్ యాప్‌లో తమకు నమోదైన పత్రాలను చూపుతున్న రైతులు
చిట్యాలలో కాటన్ మిల్లు ఎదుట ధర్నా
చేస్తున్న పత్తి రైతులు
గుజ్జ గ్రామంలో నాకున్న నాలుగెకరాల్లో పండిన పత్తి పంటను అమ్ముకునేందుకుగాను కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే 43 క్వింటాళ్ల పత్తిని అమ్ముకునేందుకుగాను బుక్ అయ్యింది. విక్రయానికి కాటన్ మిల్లు వద్దకు రాగానే యాప్‌లో 14 క్వింటాళ్లు మాత్రమే నమోదైందని.. అంతే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు. స్లాట్ బుక్ చేసిన సమయంలో నమోదైన పత్తిని కొనుగోలు చేసేందుకుగాను అధికారులు సహకరించాలి.
– దోడ క్రిష్ణారెడ్డి, పత్తి రైతు, గుజ్జ గ్రామం
రైతులు పత్తి విక్రయానికి తీసుకువచ్చినప్పుడు కిసాన్‌యాప్‌లో నమోదైన క్వింటాళ్ల మేరకు పత్తిని కొనుగోలు చేస్తాం. సాఫ్ట్‌వేర్ లోపంతో జరిగిన తప్పిదాలకు తాము ఏమీ చేయలేం. ఆందోళన చేసిన రైతుల సమస్యనుపై అధికారులకు తెలియజేసి వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తాం.
– కోటేశ్వరరావు, సీసీఐ కేంద్రం సీపీఓ, చిట్యాల
సాఫ్ట్‌వేర్ లోపం.. పత్తి రైతుకు శాపం
సాఫ్ట్‌వేర్ లోపం.. పత్తి రైతుకు శాపం
సాఫ్ట్‌వేర్ లోపం.. పత్తి రైతుకు శాపం


