పనులుకాలే!
ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్‌కు
రూ.443 కోట్లు
బ్రాహ్మణవెల్లెంల భూసేకరణ పూర్తికాలే..
సంక్షేమంలో ముందుకు
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి..
డిండి ఎత్తిపోతల పనులు ఎన్నాళ్లో..
నిధులొచ్చినా..
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులను ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టినా.. అనుకోకుండా ప్రమాదం జరిగి ఫిబ్రవరి 22వ తేదీన పనులు ఆగిపోయాయి. సొరంగం కూలిన ప్రాంతానికి సమాంతరంగా 100 మీటర్లు జరిపి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వాలని భావించారు. ఇందుకోసం మిలిటరీలో వినియోగించే హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వేను చేయించారు. ఈ సర్వే నివేదిక కూడా ఇటీవల ప్రభుత్వానికి చేరింది. అయితే సొరంగంలో భారీ నీటి ప్రవాహం ఉందని, రాళ్ల నుంచి నీరు, బురద వస్తున్నట్లుగా నివేదించినట్లు తెలిసింది. మరోవైపు ఔట్‌లెట్ నుంచి తవ్వేందుకు అమెరికా నుంచి బేరింగ్ తెప్పించినా ఆదీ ఆగిపోయింది. మొత్తానికి ఈ సంవత్సరంలో సొరంగం పనులు ముందుకు సాగలేదు. వచ్చే ఏడాదైనా పనులు ప్రారంభం అవుతాయా? లేదా? వేచి చూడాల్సిందే.
సింగరాజుపల్లి రిజర్వాయర్
ఫ జిల్లాలో ఏళ్ల తరబడి సాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు
ఫ ఈ ఏడాది డిండి ఎత్తిపోతలకు రూ.1800 కోట్లు..
ఫ ఏఎమ్మార్పీ కాల్వల ఆధునీకరణకు రూ.443 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఫ అనుకోని ప్రమాదంతో నిలిచిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు
ఫ 2025లో అభివృద్ధి, సంక్షేమం మాత్రం కాస్త మెరుగు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు 2025 సంవత్సరంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అనే చందంగానే మారాయి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు ఏనాడో ప్రారంభమైనా పూర్తి కాలేదు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించినా కుడి, ఎడమ కాల్వల పనులు ముందుకు సాగలేదు. డిండి ఎత్తిపోతల పథకం పనులు అనేక అవాంతరాల నడుమ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. ఈ పనులకు ప్రభుత్వం రూ.1800 కోట్లు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)కాలువల లైనింగ్ పనులకు రూ.443 కోట్లు మంజూరు చేసింది. వచ్చే కొత్త సంవత్సరంలోనైనా వీటి పనులు ముందుకు సాగుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు మాత్రం పరుగులు పెడుతున్నాయి.
జిల్లాలో 40 ఏళ్ల కిందట తవ్విన ఏఎమ్మార్పీ కాల్వలు ప్రస్తుతం దెబ్బతిన్నాయి. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు, అక్కడినుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయ సముద్రానికి నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి మరో 36 కిలోమీటర్ల వరకు కాలువ ఉంది. ఈ కాల్వల లైనింగ్, ఆధునుకీకరణకు రూ.443 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాదైనా ఈ పనులు ప్రారంభమవుతాయా? లేదా? చూడాల్సిందే.
బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనులు పూర్తయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో ప్రారంభించారు. అయితే డిస్ట్రిబ్యూటరీల పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కుడి, ఎడమ కాల్వలకు సంబందించి 2,888 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. 1,200 ఎకరాలు సేకరించారు. వచ్చే ఏడాదైనా ఎంతమేరకు జరుగుతుందో చూడాలి.
జిల్లాలో ఈ ఏడాది సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల గృహ ప్రవేశాలు చేశారు. జిల్లాలో రెండు విడతల్లో 19,697 ఇళ్లను కేటాయించగా, అందులో 17,246 ఇళ్లు ఇప్పటికే మంజూరు చేశారు. వాటిల్లో 13,494 ఇళ్లు గ్రౌండ్ లెవల్ పనులు సాగుతుండగా, 1,868 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్లో, 650 ఇళ్లు రూప్‌లెవెల్‌లో ఉన్నాయి. మండలానికి 5 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేశారు.
ప్రభుత్వం ప్రతి నియోజక వర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనాలు నిర్మిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్‌నగర్ నుంచే ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా అనేక రంగాల్లో ప్రోత్సాహం ఇస్తోంది. పెండింగ్‌లో ఉన్న వడ్డీ బకాయిలను విడుదల చేసింది. పెట్రోలు బంక్‌ల ఏర్పాటుకు మహిళ సంఘాలు ముందుకు రావడంతో వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నల్లగొండలోని పానగల్ ఫ్లై వోవర్ నుంచి ఎస్‌ఎల్‌బీసీ మెడికల్ కాలేజీ వరకు రూ.500 కోట్లతో నిర్మించే బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల నిర్మాణ పనులను ఈ ఏడాది ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాంగా డిండి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏడు రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు, నల్లగొండ జిల్లాలో ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే వాటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. కాలువల పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. డిండి ఎత్తిపోతలకు ఏదుల నుంచి నీటిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ల పనులను పూర్తి చేసేందుకు, కాలువలు తవ్వేందుకు ఇటీవల రూ.1800 కోట్లను కూడా మంజూరు చేసింది. టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమతున్నారు. అయితే ఆ పనులు 2026 సంవత్సరంలో ఎంత మేరకు సాగుతాయో వేచి చూడాల్సిందే.
పనులుకాలే!
పనులుకాలే!
పనులుకాలే!


