కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ
నల్లగొండ : కలెక్టరేట్‌లో రూ.40 కోట్ల వ్యయంతో 82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి, ప్లస్ టు విధానంలో అదనపు బ్లాక్ నిర్మాణానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని మౌలిక సదుపాయాలు, ఎలివేషన్, అత్యాధునిక డిజైన్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 250 సీట్ల సామర్థ్యం కలిగిన సమావేశ మందిరం సమీక్షలు, పెద్ద సమావేశాలకు సరిపోవడం లేదని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి దృష్టికి తీసుకుపోవడంతో అదనపు బ్లాక్‌ను మంజూరు చేయించారని తెలిపారు. నూతన అదనపు బ్లాకు నిర్మాణాన్ని పది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్‌కుమార్, రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు శ్రీధర్‌రెడ్డి, ఫణిజా, గణేష్, జిల్లా రెవెన్యూ ఇన్‌చార్జి అధికారి వై.అశోక్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.


