14 నుంచి ఎంజీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 14 నుంచి డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్‌లాగ్ 1, 3, 5 పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో తీసుకున్న హాల్‌టికెట్ లేదా నూతన హాల్‌టికెట్‌తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారని తెలిపారు. కళాశాల గుర్తింపు కార్డు, ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రావాలని పేర్కొన్నారు. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల సమ్మె విరమణ
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 40 రోజులుగా చేపట్టిన సమ్మెను సోమవారం విరమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మారం నాగేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి.. డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. సమ్మె విరమించడంతో యూనివర్సిటీ పరిధిలో పరీక్షలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల విషయంలో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలి కృతజ్ఞతలు తెలిపారు.
రహదారి వెంట
విద్యుత్ కాంతులు
● సుందరీమణుల కోసం కాకుండా.. నిత్యం వెలిగేలా చూడాలంటున్న ప్రజలు
పెద్దవూర : బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరీమణులు ప్రపంచ పర్యాటక ప్రదేశమైన నాగార్జునసాగర్ బుద్ధవనం సందర్శనకు సోమవారం వచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా మండల కేంద్రంలోని నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట డివైడర్ల పొడవునా సుమారు రూ.25 వేల వ్యయంతో రకరకాల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రోడ్డు వెంట పేరుకుపోయిన చెత్తాచెదారం, డివైడర్ల వెంట మొలిచిన పిచ్చిమొక్కలను పారిశుద్ద్య కార్మికుల చేత తొలగింపజేశారు. డివైడర్ల వెంట ప్రధాన రహదారి మధ్యలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలకు మరమ్మతు చేసి వెలిగించారు. ప్రపంచ సుందరీమణులు వచ్చినప్పుడే కాకుండా నిత్యం ప్రధాన రహదారి వెంట శుభ్రం చేసి విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని మండల కేంద్రంలో ప్రజలు అంటున్నారు.


