అనర్హులకు ఇళ్లు కేటాయించొద్దు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులు కేటాయించకుండా.. మండల ప్రత్యేక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికార, రాజకీయ ఒత్తిళ్లకు లోను కావొద్దన్నారు. రాజీవ్ యువవికాసం పథకం లక్ష్యాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొననున్న మహిళలు ఈ నెల 12న నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని సందర్శిస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రపంచ సుందరీమణుల సాగర్ సందర్శన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానం పలకాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓలు వై.అశోక్‌రెడ్డి, శ్రీదేవి జిల్లా అధికారులు పాల్గొన్నారు.


