బస్టాండ్‌లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ బస్టాండ్లల్లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కొణతం జానిరెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడ ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. అనంతరం డిపోలోని సిబ్బంది పనితీరుతో పాటు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్‌లో ప్రస్తుతం మంచినీటి సమస్య లేదని, కొన్ని ఫ్యాన్లు తిరగడం లేదని వాటికి వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు. బస్టాండ్‌లో ఉన్న కార్గో కేంద్రాన్ని బస్‌పాస్ కౌంటర్ వైపు మర్చేందుకు స్థలాన్ని పరిశీలించామన్నారు. ఆయన వెంట ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజయ్య, డిపో మేనేజర్ రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు.
అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరిప్రదర్శన కోసం మే 10 తేదీ సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్‌లు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి తెలిపారు. రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 92980 08888 ఫోన్ నంబర్‌ను, అన్ని సమీప బస్‌స్టేషన్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
డీటీసీ మోటార్ సైకిళ్ల తరలింపు
నల్లగొండ : జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో అన్‌క్లెయిమ్డ్, అబాన్డెడ్ వాహనాల కింద కేసులు నమోదైన 73 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి (డీటీసీ) తరలించినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు పోలీస్‌స్టేషన్‌లో వారి వాహనాల డాక్యుమెంట్లు చూపించి తమ బైక్‌లను తీసుకెళ్లాలని తెలిపారు. లేకపోతే ఆరు నెలల కాల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి బహిరంగ వేలం వేస్తామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ సూరప్పనాయుడు ఫోన్ నంబర్‌ను 8712670170 సంప్రదించాలని సూచించారు.
తరగతుల పర్యవేక్షణ
నల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రిపరేషన్ కోసం నిర్వహిస్తున్న తరగతులను శనివారం ఇంటర్ బోర్డు అధికారి భీమ్‌సింగ్.. డీఐఈఓ దస్రూనాయక్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సుధారాణి, ధనరాజ్, హేమ్లానాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు.


