కల్వర్టుల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు
నల్లగొండ : జిల్లాలోని మైనర్, మేజర్ కల్వర్టుల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖకు సంబందించి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి నుంచి నల్లగొండకు వచ్చే ఆర్‌అండ్‌బీ రోడ్డులో 14/912 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.10 కోట్లు అదే రోడ్డులోని 22/727 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ. 4.90 కోట్లు, 23/8–10 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.5.20 కోట్లు, 24/477 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.85 కోట్లు, 27/273 కి.మీ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.95 కోట్లును ప్రభుత్వం విడుదల చేసింది. వాటిని పనులను వెంటనే ప్రారంభించాలని చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలు అందాయి.
నేడు ఫుడ్ లైసెన్స్ మేళా
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీన నల్లగొండలో ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫుడ్‌సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకొని తమ వ్యాపార సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. హోటల్స్, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కిరణాదుకాణాలు, మాంసం, చేపలు విక్రయ కేంద్రాలు, పాల, పాల ఉత్పత్తుల వ్యాపారులు, ఫుడ్ స్టాల్స్, వీధి ఆహార విక్రేతలు, క్యాటరింగ్ చేసే వ్యాపారులు తప్పకుండా ఈ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈనెల 6న నల్లగొండలోని బీటీఎస్ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్‌లో ఉన్న ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి మేళా ఉంటుందని తెలిపారు.
ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
నకిరేకల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల రద్దుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్, జాతీయ విత్తనం, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ నకిరేకల్‌లోని నర్రా రాఘవరెడ్డి స్మారక భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ శీతాకాాల సమావేశాల్లో అప్రజాస్వామికమైన ఐదు చట్టాలను చేసి రైతులకు, కార్మికులకు, ప్రజలకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందాల ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన వెంకులు, చింతపల్లి బయ్యన్న, జిట్టి నగేష్, పెంజర్ల సైదులు, రాచకొండ వెంకన్న, వంటెపాక వెంకటేశ్వర్లు, బొమ్మకంటి కొమరయ్య, సిలివేరు ప్రభాకర్, అంబటి చిరంజీవి, మల్లం మహేష్, కాశీరాం, బొల్లికొండ లింగయ్య, జిట్ల సరోజ, చింతపల్లి లూర్దు, కోట లింగయ్య, సాకుంట్ల నర్సింహ, వంటెపాక కృష్ణ పాల్గొన్నారు.
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రద్దు చేయబడిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో సహస్రనామార్చన చేశారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపించిన అర్చకులు, ఉత్సవమూర్తుల నిత్య తిరుకల్యాణాన్ని నేత్రపర్వంగా చేపట్టారు. వీటితో పాటు బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవోత్సవం తదితర పూజలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
కల్వర్టుల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు


