వెల్‌నెస్.. మందులు లెస్!
నాలుగు నెలల నుంచి పూర్తిగా మందులు ఇవ్వడం లేదు. బీపీ, షుగర్ మందులు కూడా లేవు. డాక్టర్ రాసిన మందుల్లో సగం కూడా ఇవ్వలేదు. రెండు గంటలు కూర్చున్నా రెండు మూడు ట్యాబ్లెట్లు ఇచ్చి మిగతావి లేవని చెపుతున్నారు. మిగతా వాటిని బయట కొనాల్సివస్తోంది.
– అనంతరెడ్డి, పెద్దసూరారం
నల్లగొండ టౌన్ : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని వెల్‌నెస్ సెంటర్‌లో మందుల కొరత తీరడం లేదు. నాలుగు నెలులుగా పూర్తిస్థాయిలో మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ డాక్టర్ సూచించిన ప్రిస్కిప్షన్‌లోని సగం మందులు కూడా ఇవ్వడం లేదు. కనీసం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, జ్వ రం, జలుబు తదితర రోగాలకు సంబంధించిన మందులు కూడా లేవు. వెల్‌నెస్ సెంటర్ నిర్వహణను గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చేపట్టగా.. కొన్ని నెలలుగా డీఎంఈ పరిధిలోకి వచ్చింది. అప్పటినుంచి మందులు పూర్తిస్థాయిలో రావడం లేదని తెలుస్తోంది.
ప్రైవేట్ దుకాణాల్లో కొనాల్సిందే..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన హెల్త్‌కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు నల్లగొండలోని వెల్‌నెస్ సెంటర్‌కు రోజూ వందల మంది వస్తుంటారు. ఇక్కడ కేవలం జనరల్ మెడిసిన్, డెంటల్ వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. ఇతర వ్యాధులకు సంబంధించిన బయట వైద్యులు పరీక్షించి రాసిన మందులను కూడా అందజేస్తారు. కానీ గత నాలుగు నెలలుగా వెల్‌నెస్ సెంటర్లో మందులు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల హెల్త్‌కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మందులు లేకపోవడంతో ప్రైవేట్ మందుల దుకాణాల్లో వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
గంటల తరబడి తప్పని నిరీక్షణ
వెల్‌నెస్ సెంటర్‌కు వచ్చే కార్డుదారులలో ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు. వారికి డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్‌లోని మందులను తీసుకోవడానికి రెండు నుంచి మూడు గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. ఫార్మసీలో ముగ్గురు సిబ్బందికిగాను ఒక్క ఫార్మసిస్టు మాత్రమే విధులు నిర్వహిస్తోంది. ఆమెఒక్కో కార్డుదారుకు మందులు ఇవ్వాలంటే పది నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది. దీంతో మందుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయినా కేవలం సగం మందులే ఇస్తుండడంతో వాటిని తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫ వెల్‌నెస్ సెంటర్‌లో నాలుగు నెలలుగా మందుల కొరత
ఫ దీర్ఘకాలిక రోగులకు తప్పని అవస్థలు
వెల్‌నెస్.. మందులు లెస్!


