17వ తేదీ వచ్చినా పేదలకు అందని బియ్యం
95,961 మెట్రిక్ టన్నులు పెండింగ్
2023–24 యాసంగికి సంబంధించి 3,601 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఏడాది గడిచినా ఇంకా ఇవ్వలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక 2024–25 వానాకాలనికి సంబంధించి 92,362 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. వానాకాలం సీజన్ ముగిసింది. యాసంగి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. అయినా ఇంకా బియ్యం ఇవ్వకపోవడం వల్లే పేదలకు సకాలంలో రేషన్ పంపిణీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలోనే అత్యధికంగా వరిసాగు చేస్తూ, ధాన్యం భాండాగారంగా ఉన్న నల్లగొండలోనే పేదలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. ప్రతి నెలా పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసే రేషన్ బియ్యం ఈనెలలో చాలా మండలాల్లో లబ్ధిదారులకు ఇప్పటికీ పంపిణీ కాలేదు. దీంతో పేదలకు అన్నం మెతుకులు కరువయ్యాయి. అధికారులు అలసత్వం కారణంగా పేదలకు రేషన్ ఇవ్వలేని పరిస్థితి దాపురించింది.
గడువు ముగిసినా పేదలకు అందని బియ్యం
994 రేషన్ షాపుల ద్వారా పంపిణీ
జిల్లాలో 4,66,061 రేషన్ కార్డులు ఉన్నాయి. 994 రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి నెల 20వ తేదీ నుంచి 30వ తేదీలోగా గోదాముల నుంచి రేషన్‌షాపులకు బియ్యం చేరుకోవాలి. తదుపరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపు ద్వారా పేదలకు బియ్యం పంపిణీ చేస్తారు. అయితే ఈనెల 17వ తేదీ వచ్చినా ఇంతవరకు జిల్లాలో అనేక మంది పేదలకు బియ్యం అందలేదు. కొందరు డీలర్లు పట్టుబట్టి కొంత మేర తెప్పించుకొని అదీ కొంత మందికే పంపిణీ చేశారు.
ఎమిమిది స్టాక్ పాయింట్ల నుంచి సరఫరా
జిల్లాలో ఎమిమిది రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ల నుంచి 33 మండలాల్లోని గ్రామాలకు రేషన్ సరఫరా చేస్తారు. ఇప్పటి వరకు దేవరకొండ, నిడమనూరులో కొన్ని షాపులకు, మిర్యాలగూడలో దాదాపు సగం షాపులకు, నకిరేకల్‌లో 50 షాపులకు, నల్లగొండలో 8 షాపులకు, నార్కట్‌పల్లిలో 21 షాపులకు, నాంపల్లిలో 14 షాపులకు రేషన్ బియ్యం సరఫరా కాలేదు.
గోదాముల్లో బియ్యం నిల్
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) స్టేజీ–1 గోదాములతో పాటు స్టేజీ–2 గోదాముల్లో కూడా పీడీఎస్‌కు సంబంధించిన బియ్యం నిల్వలు లేవు. వాస్తవంగా ఒక నెలకు సంబంధించిన బియ్యం ముందుగానే అధికారులు తెప్పించి పెట్టుకోవాలి. జిల్లాలో అధికారుల సమన్వయ లోపంతో బియ్యం గోదాములకు చేరలేదు.
ఫ గోదాముల నుంచి కొన్నిచోట్ల
రేషన్ దుకాణాలకు కూడా చేరలే
ఫ సీఎంఆర్ సేకరణలో అధికారుల అలసత్వమే కారణం
ఫ అర్ధాకలితో అలమటిస్తున్న పేదలు
ఈ ఫొటోలోని మహిళ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామానికి చెందిన అనిమల్ల పార్వతమ్మ. ఆమెకు ఇద్దరు కూతుర్లు. భర్త అనారోగ్యంతో మరణించాడు. ఆమె కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన అంత్యోదయ కార్డు కింద నెలకు 35 కిలోల బియ్యం వస్తాయి. వాటితోనే నెలంతా భోజనం. ఈ నెలలో ఇంతవరకు బియ్యం రాలేదు. దీంతో వారం రోజులుగా పక్కింటి వారి నుంచి బియ్యం బదులు తెచ్చుకుంటోంది. ఆమె మాత్రమే కాదు జిల్లాలోని అనేక పేదలదీ ఇదే పరిస్థితి.
సీఎంఆర్ సేకరణలో విఫలం
జిల్లాలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో ప్రతిసారి అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వానికి మాత్రం ఆలస్యంగా సీఎంఆర్ పెడుతున్నారు. మిల్లర్లు, అధికారుల కుమ్మక్కుతో ఈ తతంగం నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా మిల్లర్లు ఆలస్యంగానే సీఎంఆర్ ఇస్తారు. కానీ.. ఏనాడూ గోదాముల్లో బియ్యం ఖాళీ అయిన పరిస్థితి లేదు. ఈసారి మాత్రం అధికారుల ముందు చూపు లేకపోవడం, మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రస్తుతం గోదాములు ఖాళీ అయ్యాయి.
రేషన్.. పరేషాన్!