ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలి
తిప్పర్తి : పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం తిప్పర్తి పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి, మందుల పంపిణీ, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని పేషంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, వైద్యులు మమత, నవనీత, షాబుద్దిన్ పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో హెల్ప్ డెస్క్
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఇటీవల బాధ్యతలను స్వీకరించిన సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు నేత రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వైద్యం పొందడంలో ఆలస్యం కాకుండా సకాలంలో రోగులకు వైద్యం అందాలనే లక్ష్యంతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం, అత్యవసర విభాగం, అవుట్ పేషంట్ రోగుల విభాగాల్లో శుక్రవారం హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయించారు. హెల్ప్ డెస్క్‌లలో సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఇక ఎంసీహెచ్ వద్ద పాదరక్షలు విడిచేందుకు ప్రత్యేకంగా స్టాండ్‌లను ఏర్పాటు చేయించి.. అక్కడ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. అత్యవసర విభాగం గేటు వద్ద ప్రత్యేకంగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయించారు. రోగులకు అందించే డైట్ వివరాలను ప్రతి వార్డులో డిస్‌ప్లే చేయాలని, రోగులకు స్కానింగ్, ఇతర పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.
నార్కట్‌పల్లి ఎస్‌ఐ
ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ను ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఆయనను వీఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది. ఆయన స్థానంలో చిట్యాల ఎస్‌ఐ రవికుమార్‌కు.. నార్కట్‌పల్లి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలి


