సంక్రాంతికి వస్తున్నాయ్
రైతులు దరఖాస్తులు చేసుకోవాలి
రైతుల చెంతకు యాంత్రీకరణ పరికరాలు
నల్లగొండ అగ్రికల్చర్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన(2018)లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకం అమలు చేసి రైతులకు సబ్సిడీపై పరికరాలను అందించాలని నిర్ణయించింది. 2024 సంవత్సరానికి గాను జిల్లాకు 1.81 కోట్ల నిధులను కేటాయించింది. 2025 మార్చి 31లోగా పరకరాలను పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పరికరాల పంపిణీకి మోక్షం లభించలేదు. తిరిగి 2025 సంవత్సరానికి గాను పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వాటా ఉంటుంది. గతంలోనే కొందరిని ఎంపిక చేయగా.. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్ ఇచ్చేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది.
సబ్సిడీ ఇలా..
వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు ఇచ్చే సబ్సిడీలో ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు పరికరం ధరలో 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రైతు ఎంపిక చేసుకున్న కంపెనీ ధరలో సబ్సిడీ పోను మిగతా వాటా డబ్బులను రైతు డీడీ రూపంలో దరఖాస్తుతో అందించాల్సి ఉంటుంది.
పరికరాలు ఇవే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యాంత్రీకరణ పరికరాలను పెద్ద సంఖ్యలో కేటాయించింది. పవర్ టిల్లర్లు 50, బ్రష్‌కట్టర్స్ 83, పవర్‌టిల్లర్లు 58, మేజ్‌సెల్లర్స్ 20, స్ట్రాబెల్లర్స్ 90, చేతిపంపులు 8,289, పవర్ స్ప్రేయర్స్ 1,047, రోటోవేటర్స్ 463, విత్తనాలు, ఎరువులు వేసే పరికరాలు 107, ట్రాక్టర్ పనిముట్లు 475, బండ్ ఫార్మర్స్ 45 జిల్లాకు కేటాయించింది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ ఆయా నియోజకవర్గ, మండలాల వారీగా పరికరాలను కేటాయించి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
పండుగ తరువాత పంపిణీ చేసేలా..
వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను జిల్లాలో సంక్రాంతి పండుగ తరువాత పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల లబ్ధిదారుల ఎంపిక చేసింది. అయితే దాదాపు 10 వేల వరకు పరికరాలు ఉండగా.. ఐదు వేలలోపే దరఖాస్తులు రావడంతో.. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరణ చేపట్టారు. పండుగలోపు ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికను తయారు చేసింది. శుక్రవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పరికరాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. పండుగ తరువాత జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పరికరాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.
సబ్సిడీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రైతులు తమ పరిధిలోని వ్యవసాయాధికారులను సంప్రదించి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ
ఫ జిల్లాకు రూ.8 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
ఫ కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
ఫ పండుగ తర్వాత పంపిణీకి సన్నాహాలు


