అంతర్గత దారులు అస్తవ్యస్తం
హాలియా : హాలియా మున్సిపాలిటీలోని శివారు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పట్టణంలోని సాయినగర్ కాలనీ, వీబీ నగర్ కాలనీ, శాంతినగర్, గంగారెడ్డినగర్, అనుముల వారిగూడెం ప్రాంతాల్లో సీసీ రోడ్లు లేక ఆయా కాలనీలో నేటికి మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితేచాలు.. మట్టి రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా నడవలేని స్ధితికి చేరుతుండడంతో ప్రజలకు బాధలు తప్పడం లేదు. వర్షాకాలంలో వర్షపునీరంతా మట్టి రోడ్డు గుంతల్లోకి చేరడం వల్ల రోడ్లన్నీ చిత్తడిచిత్తడిగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
చండూరు : మున్సిపాలిటీలో రోడ్లు మురుగుకాల్వలను తలపిస్తున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ఇళ్లలోని నీరు వీధుల్లో పారుతోంది. దీంతో అంతర్గత రహదారులన్నీ కంపుకొడుతున్నాయి. మున్సిపాలిటీలో మెత్తం 15 కిలో మీటర్ల మేర అంతర్గత రోడ్లు ఉండగా అందులో 8 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. 7 కిలోమీటర్లు మట్టి రోడ్లే ఉన్నాయి. ఈ మట్టి రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం, ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది అప్పుడప్పుడు తవ్వి వదిలేయడంతో ఆ రోడ్లపై ప్రయాణం ప్రజలకు నరకప్రాయంగా మారింది. మెయిన్ రోడ్డు పనులు త్వరగా చేయకపోవడం, పాత డ్రెయినేజీ మూసి వేయడంతో మురుగు అంతా రోడ్లపై ప్రవహిస్తోంది.
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు అస్తవ్యస్థంగా మారాయి. ప్రధానంగా తాళ్లగడ్డలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం తీసిన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో సరిగా సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాలకు రోడ్లు బురద మయంగా మారుతున్నాయి. సీతారాంపురం–బంగారుగడ్డకు వెళ్లేందుకు బిడ్జి నిర్మాణం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు వేయలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అంతర్గత దారులు అస్తవ్యస్తం
అంతర్గత దారులు అస్తవ్యస్తం


