34వేల మందికి వైద్యపరీక్షలు | Sakshi
Sakshi News home page

34వేల మందికి వైద్యపరీక్షలు

Published Sun, Nov 12 2023 1:12 AM

నల్లగొండలోని మాన్యంచెల్కలోని పీహెచ్‌సీలో పరీక్షలు చేస్తున్న వైద్యులు - Sakshi

నల్లగొండ టౌన్‌: మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న ప్రారంభించిన ఆరోగ్య మహిళా కార్యక్రమం అతివలకు భరోసాగా నిలుస్తోంది. మహిళలకు వచ్చే జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. దీంట్లో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 34 వారాలుగా ఇప్పటి వరకు మొత్తం 34,056 మంది మహిళలకు ప్రత్యేక వైద్యసేవలు అందించారు.

మొదట ఆరు కేంద్రాల్లో..

జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో తొలుత ఆరు నియోజకవర్గాల్లోని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క, డిండి, నిడమనూరు, వేములపల్లి, కట్టంగూర్‌, మర్రిగూడలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రెండో దశలో తిప్పర్తి, చండూరు, చింతపల్లి, శాలిగౌరారం, దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యమహిళను ప్రారంభించారు. అయితే జిల్లాలోని తొలి, రెండో విడతల్లో ఎంపిక చేసిన మొత్తం 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళా వైద్యుల చేత మహిళలకు ప్రత్యేక వైద్యసేవలను అందిస్తున్నారు.

అందిస్తున్న సేవలు

మహిళలకు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, రక్తహీనత, మూత్రనాళ ఇన్‌ఫ్లెక్షన్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, కుటుంబ నియంత్రణ, మోనోపాజ్‌ నిర్వహణ, రుతుస్రావం, ఊబకాయం, బీపీ, షుగర్‌ తదితర పరీక్షలు నిర్వహించి వైద్యంతోపాటు అవపరమైన వారికి ఉచితంగానే మందులను అందిస్తున్నారు. పీహెచ్‌సీ స్థాయిలో చేసే వైద్యసేవలు ఉంటే అక్కడే చికిత్సలను కొనసాగిస్తున్నారు. ఏమైన తీవ్రమైన సమస్యలుంటే వెంటనే వారిని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేసి అక్కడి తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఉచితంగా ఖరీదైన పరీక్షలను చేయిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రత్యేక వైద్యుల చేత వైద్యం అందిస్తున్నారు.

మహిళలకు వరంలాంటిది

ఆరోగ్య మహిళ కార్యక్రమం మహిళలకు వరంలాంటిది. ప్రతి మంగళవారం ఎంపిక చేసిన 11 పీహెచ్‌సీల్లో మహిళా వైద్యులచేత ప్రత్యేక వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఏమైన వ్యాధులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ప్రత్యేక వైద్యుల చేత చికిత్స అందిస్తున్నాం. మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ అనిమళ్ల కొండల్‌రావు,

డీఎంహెచ్‌ఓ, నల్లగొండ

ఫ 34 వారాల్లో ఆరోగ్య మహిళ ద్వారా అందించిన సేవలు

ఫ 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొనసాగుతున్న కార్యక్రమం

ఫ అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ

ఫ వైద్యం కోసం మహిళల బారులు

పరీక్షల వివరాలు ఇలా..

ఎంపికైన పీహెచ్‌సీలు 11

పరీక్షలు చేసిన వారాలు 34

పరీక్షలు చేయించుకున్న మహిళలు 34,056

రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు 29,217

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ టెస్టులు 29,162

క్యాన్సర్‌ ఉన్నట్లు గుర్తించిన బాధితులు 07

తగ్గుతున్న మహిళల మరణాలు

మహిళలకు వచ్చే క్యాన్సర్‌, రోమ్ము క్యాన్సర్‌, రక్తహీనత, లైంగిక తదితర వ్యాధులను గతంలో ముందుగా గుర్తించకపోవడంతో ఆ వ్యాధులు ముదిరి అనేక మంది మహిళలు మృత్యువాత పడేవారు. కానీ ప్రస్తుతం ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వారికి ఉచితంగా పరీక్షలు చేసి చికిత్స అందించడం ద్వారా మహిళల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉచితంగా ఖరీదైన వైద్యం చేస్తుండడంతో ప్రతి మంగళవారం ఎంపిక చేసిన పీహెచ్‌సీల్లో కొనసాగుతున్న ఆరోగ్య మహిళ శిబిరాలకు మహిళలు బారులుదీరుతున్నారు.

1/1

Advertisement
Advertisement