రోడ్డు ప్రమాదంలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం

Oct 11 2023 7:42 AM | Updated on Oct 11 2023 9:00 AM

- - Sakshi

నల్గొండ: బైక్‌ వెళ్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్పీఎఫ్‌) కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన అనుముల మండలంలోని పులిమామిడి స్టేజీ సమీపంలో నల్లగొండ–హాలియా రహదారిపై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని సుదర్శనపురం గ్రామానికి చెందిన బుసిపాక మధు(30) కొంతకాలంగా నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇటీవల తన చెల్లెలు పెళ్లి పనుల కోసం నాలుగు రోజులు సెలవు పెట్టి మధు తన స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి విధుల్లో చేరేందుకు సోమవారం బైక్‌పై మధు నాగార్జునసాగర్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో అనుముల మండలంలోని పులిమామిడి స్టేజీ వద్దకు రాగానే బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మధు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న హాలియా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి భార్య సుమలత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement