సంజీవరెడ్డి(ఫైల్)
నల్గొండ: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలయ్యాడు. చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దండుమల్కాపురం గ్రామానికి చెందిన అత్తాపురం సంజీవరెడ్డి(65)కి ట్రాక్టర్ ఉంది. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో మట్టితోలేందుకు కిరాయికి వెళ్లాడు. పరిశ్రమలో ఎత్తుగా ఉన్న ప్రదేశంలో మట్టి అన్‌లోడ్ చేయాల్సి వచ్చింది.
తనకు ట్రాక్టర్‌ను రివర్స్ తీయడం రాకపోవడంతో మరో ట్రాక్టర్ డ్రైవర్ సాయాన్ని కోరాడు. ఆ క్రమంలో వెనుక వైపు అత్తాపురం సంజీవరెడ్డి నిల్చున్న విషయాన్ని గమనించకుండా, నిర్లక్ష్యంగా సదరు డ్రైవర్ ట్రాక్టర్‌ను వెనక్కి తీశాడు. దాంతో ట్రాక్టర్ వెనుక భాగంలోని ట్రాలీ టైరు ఒక్కసారిగా సంజీవరెడ్డి మీది నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతడిని హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎస్.దేవేందర్ తెలిపారు.


