ఒడిదుడుకుల సాగు | - | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల సాగు

Dec 28 2025 12:45 PM | Updated on Dec 28 2025 12:45 PM

ఒడిదు

ఒడిదుడుకుల సాగు

రైతు భరోసా కోసం ఎదురు చూపులు..

నల్లగొండ అగ్రికల్చర్‌ : 2025 వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తి 5,56,826 ఎకరాల్లో, వరి 5,48,134 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే వర్షాలకు పంటలు దెబ్బతిని ఓవైపు, పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో ఎదురైన సమస్యలతో మరోవైపు ఇబ్బందులు తప్పలేదు. ఇక యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది.

ముంచిన అత్యధిక వర్షం..

జూన్‌, జూలై నెలల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. కానీ అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జిల్లా వ్యాప్తంగా అధిక వర్షం కురిసింది. అప్పటికే పత్తి కాయ పగులే దశలో ఉండటంతో కాయలు రాలడంతో పాటు పగిలిన పత్తి కారిపోయింది. 25,919 ఎకరాల్లో 30 శాతానికి పైగా పంట దెబ్బతిందని యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. వర్షంతో ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్న పత్తి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇక వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 35,487 ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. వర్షాల వల్ల వరి చేలు నీటిలో మునిగి ధాన్యం మొలకెత్తింది. దీని కారణంగా వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.

అమ్ముకోవడానికి అష్టకష్టాలు..

జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో పండించిన పత్తి, ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడ్డారు. పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి పోతే తేమ శాతం ఎక్కువగా ఉందని నెల వరకు కొనుగోలు చేయలేదు. పత్తి అమ్మకానికి కపాస్‌ కిసాన్‌ యాప్‌లో రైతులు నమోదు చేసుకోవాల్సి ఉండగా దానిపై అవగాహన లేక నేటికీ ఇంకా పత్తిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం కోసం తెచ్చి రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకునే కల్లాలు లేని కారణంగా పచ్చి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తెచ్చారు. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడంతో దాన్యాన్ని రోజుల తరబడి కేంద్రాల వద్ద ఆరబెట్టుకుని అమ్ముకోవాల్సి వచ్చింది.

యూరియా కోసం పడిగాపులు..

వానాకాలం సీజన్‌లో ఒకేసారి పత్తి, వరి చేలకు యూరియా వేసే సమయం రావడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం రోజుల తరబడి పీఏసీఎస్‌ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. డిమాండ్‌కు తగినట్లుగా ప్రభుత్వం యూరియాను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు చెప్పులను, పాస్‌బుక్‌లను లైన్‌లో పెట్టి రాత్రిళ్లు కూడా ఆయా కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది.

యాంత్రికరణ పథకం వాయిదా..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం తప్ప అడుగు ముందుకు పడలేదు. పథకం అమలు కోసం నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తుందే తప్ప.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

రైతులకు 2025 సంవత్సరంలో వ్యవసాయం కలిసి రాలేదు. ఎన్నో ఒడిదుడుకులను

ఎదుర్కొని వానాకాలంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులకు అతివృష్టి, అనావృష్టి కన్నీరు మిగిల్చింది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని పెట్టుబడి కూడా చేతికి రాక రైతులు అప్పుల పాలయ్యారు.

యాసంగి సీజన్‌ ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. సీజన్‌ ఆరంభమైనందున విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, వరి నాట్ల కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు, పొలాలు, దున్నకాల కోసం రైతులు పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు చెల్లిస్తుందో అన్న ఎదురు చూపుల్లో రైతులు ఉన్నారు.

ఫ వానాకాలంలో భారీ

వర్షాలతో రైతులు ఆగం

ఫ సగానికి పడిపోయిన దిగుబడులు

ఫ పంటలు అమ్ముకునేందుకు తిప్పలు

ఫ యూరియా కోసం తప్పని పడిగాపులు

ఫ రైతు భరోసాకు తప్పని ఎదురుచూపులు

ఫ రైతులకు కలిసిరాని 2025 సంవత్సరం

ఒడిదుడుకుల సాగు1
1/2

ఒడిదుడుకుల సాగు

ఒడిదుడుకుల సాగు2
2/2

ఒడిదుడుకుల సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement