చెర్వుగట్టులో తలనీలాల సేకరణకు వేలం
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో తలనీలాల సేకరణకు గాను ఆలయ ఆవరణలో కార్యనిర్వహణ అధికారి సల్వాది మోహన్‌బాబు సమక్షంలో శనివారం వేలం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కేఎం హెయిర్స్ ఇంటర్నేషనల్ కంపెనీ వారు రూ.2.50 కోట్లకు తలనీలాల సేకరణ హక్కును దక్కించుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడి వద్దకు బీజేపీ నేతల పంచాయితీ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, పార్టీ నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజుయాదవ్ వర్గాల మధ్య జరిగిన వివాదం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వద్దకు చేరింది. ఈ ఘటనపై ఇద్దరు నాయకులతో మాట్లాడిన రాంచందర్‌రావు జనవరి 2వ తేదీ వరకు దీనిపై ఎవరూ మాట్లాడవద్దని తనదైన శైలిలో చెప్పినట్లు తెలిసింది. జనవరి 2వ తేదీన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే జిల్లా నాయకుల వ్యవహారశైలి, నాయకుల మధ్య వర్గపోరు, పార్టీ బలోపేతం చేయకుండా కొట్టుకుంటున్న వ్యవహారంపై చర్చించనున్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. తాను మాట్లాడే వరకు ఏ సమావేశంలో కూడా ఈ ఘటనపై గప్‌చుప్‌గా ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా.. శనివారం పిల్లి రామరాజు యాదవ్.. రాంచందర్‌రావును కలిసి జరిగిన ఘటనపై వివరించారు.
హనుమంతు
కుటుంబానికి పరామర్శ
చండూరు : ఒడిశాలో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి శనివారం చండూరు మండలం పుల్లెంలలో పరామర్శించారు. హనుమంతు అంత్యక్రియల ఏర్పాటు చేస్తున్న ఆయన బావ మల్లిక్‌తో మాట్లాడారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. హనుమంతును లొంగిపొమ్మని చెప్పేందుకు తాను ప్రయత్నించానని, అందులో భాగంగానే ఒడిశా వెళ్లి 10 రోజులు ఉన్నా.. హనుమంతును కలవడం కుదరలేదని మల్లిక్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నలపరాజు రామలింగయ్య, నలపరాజు సతీష్, పుల్లెంల మాజీ సర్పంచ్‌లు పాలకూరి సత్తయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, సర్పంచ్ ముక్కాముల వెంకన్న, తిప్పర్తి రాములు, అంజాచారి, కరీం, వెంకట్‌రెడ్డి, శివర్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ సభను
జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ యూరియా విషయంలో కొత్తగా తీసుకొచ్చిన యాప్‌పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సీపీఐ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్‌లను సన్మానించారు. సమావేశంలో బుచ్చిరెడ్డి, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, లోడంగి శ్రావణ్ కుమార్, ఉజ్జని యాదగిరిరావు, వీరస్వామి, నర్సింహ, రామచంద్రం, వెంకటేశ్వర్లు, రామలింగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చెర్వుగట్టులో తలనీలాల సేకరణకు వేలం
చెర్వుగట్టులో తలనీలాల సేకరణకు వేలం


