గుట్టుగా అమ్మేశారు..! | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా అమ్మేశారు..!

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ప్రభుత్వ ధాన్యం తీసుకున్న మిల్లుల వద్ద బకాయి సొమ్ము వసూళ్లు నత్తకు నడక నేర్పుతోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యం ఇవ్వకుండా మిల్లుల యజమానులు గుట్టుగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. బియ్యం అప్పగించాలని కోరగా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఒత్తిళ్లు చేసినా.. కేసులు పెడతామని బెదిరించినా.. చివరకు కేసులు నమోదు చేసి జైలుకు పంపించినా వసూళ్లు మాత్రం 50 శాతం దాటలేదు. పైపెచ్చు తమను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మిల్లర్లు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉంది. 2022– 23 రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 82 మిల్లులు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం 1.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తీసుకుంది. బియ్యం ఇవ్వకపోవడంతో వాటి విలువ రూ.250.65 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. మూడేళ్ల నుంచి రికవరీ చేస్తుండగా ఇప్పటి వరకు రూ.116.56 కోట్లు మాత్రమే (దాదాపు 46.50 శాతం) వసూలయ్యాయి. ఇంకా రూ.134.10 కోట్ల బకాయిలు మిగిలాయి. ప్రభుత్వం మాత్రం బియ్యం ఇవ్వడానికి ఈ నెల 30 వరకు గడువు ఇచ్చింది.

కాసులకు కక్కుర్తి పడి..

అధికారుల లెక్కల ప్రకారం 2022– 23లో మొత్తం 1,61,009.64 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 82 మిల్లులు తీసుకున్నాయి. 27,565.77 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సమానమైన బియ్యం అప్పగించారు. వేలంలో కొనుగోలుదారులు 22,046.94 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తీసుకెళ్లగా.. ఇంకా 1,11,397.05 మెట్రిక్‌ టన్నుల దాన్యం మిల్లుల వద్దనే ఉండిపోయింది. అయితే మిల్లర్లు ఈ ధాన్యాన్ని బయట మార్కెట్‌లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ తతంగం జరిగిందని చెప్పవచ్చు. కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడటంతో మిల్లులో ధాన్యం దందా జోరుగా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ధాన్యం బకాయిలు చెల్లింపులో మిల్లర్ల మీనమేషాలు

2023–23 నుంచి వసూలు చేసింది 46.50 శాతం మాత్రమే..

మూడేళ్లు గడుస్తున్నా నత్తనడకన సాగుతున్న వసూళ్ల పర్వం

ప్రభుత్వం నుంచి అధికారులపైపెరుగుతున్న ఒత్తిళ్లు

తమను వేధింపులకు గురిచేస్తోందని మిల్లర్ల గగ్గోలు

రూ.కోటికిపైగానే..

జిల్లాలో 2022– 23 ధాన్యానికి సంబంధించి 82 మిల్లుల నుంచి రూ.250.65 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో మొత్తం వసూళ్లు రూ.116.56 కోట్లకు చేరాయి. బకాయిల పరంగా చూస్తే 28 మిల్లులకు సంబంధించి ఒక్కొక్క దాని నుంచి రూ.కోటికిపైగానే వసూలు కావాల్సి ఉంది. వీటిలో తాడూరులోని శ్రీలక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్‌ వద్ద అత్యధికంగా సుమారు రూ.19.55 కోట్లు, కొండారెడ్డిపల్లిలోని పద్మావతి పారా బాయిల్డ్‌ ఇండస్ట్రీస్‌ వద్ద రూ.18.58 కోట్లు, అచ్చంపేటలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఇండస్ట్రీస్‌ వద్ద రూ.14.28 కోట్లు పేరుకుపోయాయి. అలాగే సింగవరం మదనగోపాల ఇండస్ట్రీస్‌ వద్ద రూ.5.45 కోట్లు, పోల్కంపల్లిలోని జోగుళాంబ రైస్‌ మిల్‌ వద్ద రూ.4.57 కోట్ల బకాయిలు ఉన్నాయి.

వాటి నుంచి సున్నా రికవరీ

జిల్లాలోని 82 మిల్లుల్లో 67 మిల్లుల వద్ద ఇంకా బకాయిలు ఉండగా.. 23 మిల్లుల నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదు. మరోవైపు కొన్నిచోట్ల గణనీయంగా వసూలైనా పూర్తి బకాయిలు మాత్రం తీరలేదు. ధాన్యం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉండటంతో అధికారులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement