సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించాలి

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

కందనూలు: సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నెలవారి కేసుల వివరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లావ్యాప్తంగా నమోదైన నేరాలు, దర్యాప్తు పురోగతి, మిస్సింగ్‌, ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ, గ్రేవ్‌, నాన్‌– గ్రేవ్‌, సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ అమలు చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మిస్సింగ్‌ కేసుల దర్యాప్తును అత్యంత ప్రాధాన్యంతో చేపట్టి, అదృశ్యమైన వారి ఆచూకీ త్వరితగతిన గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ/ ఎస్టీ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావు లేకుండా చట్టపరమైన గడువుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రేవ్‌, నాన్‌– గ్రేవ్‌ కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించాలన్నారు. క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ డేటాను తప్పనిసరిగా నవీకరించాలని, మాన్యువల్‌ రికార్డులు, సీసీటీఎన్‌ఎస్‌ నమోదు మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సకాలంలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ లేదా ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, ఫేక్‌ నంబర్‌ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయల్‌– 100కు వచ్చే ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందేలా ప్రతి కాల్‌ను అత్యంత ప్రాధాన్యంతో పరిగణించాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో డీఎస్పీలు సాయివెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, బుర్రి శ్రీనివాస్‌, సీఐలు అశోక్‌రెడ్డి, శంకర్‌, నాగరాజు, భీమ్‌కుమార్‌, మహేష్‌, రఘువీరారెడ్డి, చంద్రయ్య, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement