● అడుగంటిన జలాశయాలు..
ఆగిన సాగు
● ఖరీఫ్‌లో 8 లక్షల ఎకరాలకుగాను 6.50 లక్షల ఎకరాల్లోనే సాగు
● జూరాల చరిత్రలో తొలిసారిగా
నవంబర్‌లోనే నీటి ఎద్దడి
● ఐదు ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో
రెండో పంటకు నీళ్లివ్వలేని దుస్థితి
● వచ్చే వర్షాకాలం వరకు
తాగునీటి అవసరాలకే
ప్రాజెక్టుల నీరు
● ఆరుతడి పంటలే సాగు
చేయాలంటున్న అధికారులు
గద్వాల: ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు.. ఫలితంగా అడుగంటిన జలాశయాలు! ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కింద ఈసారి ఖరీఫ్ సాగుకే నీటి కష్టాలు ఎదురుకాగా.. రబీ సీజన్‌లో రెండో పంటకు పూర్తిగా నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఖరీఫ్‌లో సుమారు 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. ఈసారి 6.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాగైన పంటలకూ సెప్టెంబర్, అక్టోబర్ నుంచే నీటి ఎద్దడి మొదలైంది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేసినా పూర్తిస్థాయిలో పంటలను కాపాడలేకపోయారు. ఇప్పుడు రబీ సీజన్‌లోనూ సాగుకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జూరాల చరిత్రలోనే తొలిసారిగా నవంబర్‌లో నీటి నిల్వలు అడుగంటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.


