సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలి

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

నాగర్‌కర్నూల్‌/ కందనూలు: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన వన, విద్య, పశుసంవర్ధక, రోడ్లు– భవనాల శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ.. క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ వీసీ నిర్వహించి మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న సివిల్‌ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో సమర్థవంతంగా ఉపయోగించుకుని విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డీఈఓ రమేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ రహదారి ప్రాజెక్టుల పురోగతి, భూ సేకరణ ప్రక్రియ, అటవీశాఖ అనుమతులు, విద్యుత్‌ లైన్ల మార్పిడి, ఇతర మౌలిక సదుపాయాల తరలింపు వంటి అంశాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. ఉద్యాన పంటల సాగుకు అవసరమైన చర్యలను యంత్రాంగం చేపట్టిందని అందులో భాగంగానే జిల్లాలో 2500 ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, డీఏఓ యశ్వంతరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, ఆర్డీఓ అర్చన, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ జీవిత బీమా పథకం అమలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించేందుకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఎస్‌ సంజయ్‌జాజు జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించి మాట్లాడారు. వీసీ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక సర్వే వివరాలు, రేషన్‌ కార్డుల సమాచారాన్ని ఆధారంగా తీసుకుని అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 17, 18 తేదీల్లో నమోదు కేంద్రాల వివరాలు, నమోదు నిర్వహించే తేదీలు, సమయాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలని చెప్పారు. వీసీ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ శనివారం నుంచే గ్రామాలు, పట్టణాల్లో విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement