● రోడ్డు ప్రమాద బాధితులను
కాపాడేందుకు కేంద్రం సరికొత్త పథకం
● రూ.1.50 లక్షల వరకు ఉచితంగా
వైద్య చికిత్స
● క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తేనే ఉపయోగం
– వివరాలు 8లో..
పీఎం రాహత్‌తో భరోసా
కందనూలు: రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాద సమయంలో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులను నివారించేందుకు.. గోల్డెన్ అవర్‌లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకాన్ని తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడంతోపాటు ఆర్థిక భారం తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు నిబంధనల ప్రకారం నగదు రహిత వైద్య చికిత్స అందించే అవకాశం కల్పిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని గుర్తింపు పొందిన ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. చికిత్స ఖర్చుల గురించి ఆలోచిస్తూ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోకుండా బాధితులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో చికిత్స ఆలస్యం కావడం వంటి సమస్యలకు ఈ పథకం పరిష్కారంగా నిలవనుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
జిల్లా పరిధిలో ఇలా..
జిల్లాలో 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు సైతం ఈ పథకం కింద వైద్య సేవలు అందిస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు, ఏడు రోజులపాటు నగదు రహిత వైద్యం అందిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తే చాలు అతడికి ఈ పథకం కింద అత్యవసర చికిత్స అందిస్తారు. ప్రమాదం జరిగిన క్షణం నుంచి ఏడు రోజుల వరకు అయ్యే అన్ని రకాల అత్యవసర వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాధితులకు ఆస్పత్రులు వైద్యం నిరాకరించకూడదన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ప్రత్యేక పోర్టల్..
రోడ్డు ప్రమాదాల బాధితులకు భరోసా కల్పిస్తూ.. అత్యవసర వైద్యం అందించడంతోపాటు ఆస్పత్రి ఖర్చుల భారం తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్‌మెంట్’ (పీఎం రాహత్) అనే పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టింది. దీని కింద రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే వివరాలు సేకరించి ఈడీఏఆర్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం బాధితులను సమీపంలోని అర్హత కలిగిన ఆస్పత్రులకు తరలించి ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలి. అలాగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడంతోపాటు మ్యాపింగ్ చేసి వాటి వివరాలను ఈడీఏఆర్ పీఎం రాహత్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు లేదా స్థానికులు 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమీపంలోని ఆస్పత్రుల వివరాలతోపాటు అంబలెన్స్ సౌకర్యాన్ని పొందవచ్చు.
అవగాహన కల్పిస్తే మేలు..
పీఎం రాహత్ పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, రవాణా శాఖ సమన్వయంతో పథకం వివరాలను ప్రజలకు తెలియజేయాలి. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సహాయం అందించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత కూడా. అత్యవసర సమయంలో స్పందించి బాధితులను ఆస్పత్రికి చేర్చ డం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. పీఎం రాహత్ పథకం సమర్థవంతంగా అమలైతే రోడ్డు ప్రమాద బాధితులకు నిజమైన భరోసా లభించనుంది.


