కందనూలు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీసీ నిర్వహించి.. ప్రభుత్వ శాఖల పనితీరు, పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. సమీక్షలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని జిల్లా పరిస్థితులను వివరించారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తాగునీటి సరఫరాకు చేపడుతున్న ముందస్తు చర్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, బుల్లెట్ రైల్వే, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల పనులు, భూ సేకరణ ప్రక్రియ తదితర అంశాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, బ్రేక్‌ఫాస్ట్, యూనిఫాంల పంపిణీ, పాఠశాల భవనాల నిర్మాణాలు, కేటాయించిన నిధుల వినియోగంపై సమీక్షించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వీబీజీ రాంజీ పథకం కింద ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి, కూలీలకు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


