ప్రత్యామ్నాయం సాధ్యమేనా..! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయం సాధ్యమేనా..!

Nov 7 2026 1:18 AM | Updated on Nov 7 2026 1:18 AM

ఏదుల–డిండి లింక్‌పై భిన్నాభిప్రాయాలు

● శ్రీశైలం నుంచి అదనంగా 0.6 టీఎంసీల తరలింపు

● పాలమూరుకు ఢోకా లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అడుగులు

● 0.5 టీఎంసీలు డిండికి, 0.1 టీఎంసీ అచ్చంపేట లిఫ్ట్‌కు అని సీఎం వెల్లడి

● లేని స్పష్టత.. పునరాలోచన చేసి మళ్లీ లింక్‌ పెట్టడంపై ప్రజాసంఘాల మండిపాటు

● మౌలికంగా భూమి.. అనుబంధంగా నీటి పోరాటమని వెల్లడి

● ఈ సమస్య పరిష్కారం కాకుండా స్కీం పూర్తి కాదని స్పష్టం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఢోకా లేకుండా శ్రీశైలం నుంచి అదనంగా 0.6 టీఎంసీల నీటిని తరలించే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఏదుల నుంచి డిండికి 0.5 టీఎంసీలు.. అదేవిధంగా అచ్చంపేట లిఫ్ట్‌కు 0.1 టీఎంసీలు తరలించేలా మధ్యే మార్గంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ వ్యవస్థ ఏర్పాటు దిశగా ఎక్కడెక్కడ పంప్‌లు, పంప్‌ హౌస్‌లు, కెనాళ్లు, టన్నెళ్ల సామర్థ్యం పెంపు కోసం డిజైన్‌ రూపొందించేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించాం.’

..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నెల 23న మంత్రులు, అధికారులతో సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. ఏదుల నుంచి రెండు పథకాలకు నీరు తరలించేలా ఖర్చు బేరీజు వేసుకుని ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దీనిపైనా ఉమ్మడి జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు పలు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మధ్యే మార్గమంటూ మళ్లీ లింకా..

ఏదుల నుంచి డిండికి నీటి తరలింపుపై ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ, పాలమూరు అధ్యయన వేదిక, ప్రజా సంఘాలు పోరు బాట పట్టిన విషయం తెలిసిందే. తొలి దశలో జరుగుతున్న పనులపై ప్రతి ఊరిలో పర్యటించడం, దీని వల్ల పాలమూరుకు జరిగే అన్యాయాన్ని వివరించడంతో పాటు పాదయాత్రతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పాలమూరుకు ఢోకా లేకుండా శ్రీశైలం నుంచి అదనంగా 0.6 టీఎంసీల నీటిని ఏదుల నుంచే డిండికి తరలించే వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పాలమూరుకు అన్యాయం చేసే ఏదుల–డిండి లింక్‌ వద్దే వద్దంటూ పోరాట బాట పడితే.. పునరాలోచన చేసి మళ్లీ అదే లింక్‌కు ముడిపెట్టడంపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు ఎలానో..

పాలమూరుకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే ప్రత్యేక వ్యవస్థ ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో నానారకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గత నెలలో నిర్వహించిన సమీక్షలో చెప్పిన దాని ప్రకారం ప్రత్యేక వ్యవస్థకు మొత్తం పని వేరుగా చేయాల్సి ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు పాలమూరు–డిండి అనుసంధానం కోసం జరిగిన పనులకు సంబంధం లేకుండా టన్నెళ్లు, స్ట్రక్చర్‌ పనులను మొత్తం కొత్తగా చేయాల్సిందేనని అంటున్నారు. 0.5 టీఎంసీలు, 0.1 టీఎంసీల నీటి తరలింపునకు సంబంధించి పంప్‌లను వేరే చోట పెట్టాలంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుందని ఉదహరిస్తున్నారు. అంతకంటే పుట్టంగండి పక్కనే పంప్‌ పెట్టుకుని అక్కడి నుంచి అక్కడే డిండికి నీరు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. మరోవైపు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుపై అధికారులను ప్రశ్నించగా.. తమకు ఇంకా అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. అయితే.. సీఎం ప్రకటన కంటే ముందు జిల్లా ఇరిగేషన్‌ అధికారులు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు చేశారు. ఏదుల నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీళ్లు తరలించి 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని అందులో పేర్కొన్నారు. అధికార ప్రతిపాదన ప్రకారం నార్లపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఏదులకు కొత్తగా ప్రత్యేక లైనింగ్‌ కాల్వ, సొరంగం ఏర్పాటు చేసి నీటిని తరలిస్తారు. ఇక్కడ పంపింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసి ఏదుల నుంచి 800 మీటర్ల ఆప్రోచ్‌ కాల్వ, 0–2.52 కి.మీ ఓపెన్‌ ప్రధాన కాల్వ, 16కి.మీ సొరంగం.. అ తర్వాత 3.05 కి.మీ కాల్వ ఏర్పాటు చేసి దుందుబీ నదిలోకి నీళ్లు తీసుకెళ్లేందుకు డిజైన్‌ చేశారు. అక్కడి నుంచి ఉల్పర వద్ద రబ్బర్‌ డ్యామ్‌ నిర్మించి కెనాల్‌ కాల్వల ద్వారా నల్లగొండ జిల్లా మునుగోడు, దేవరకొండ, నల్లగొండ, గుర్రపోడు వంటి ప్రాంతాలోని ఆయకట్టుకు నీరు అందించనున్నారు. దీనిపై అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నీటితో పాటు నేల పోరాటం..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇర్విన్‌, ఎర్రవల్లి, ఉల్పర, కార్వంగ రైతులు భూముల కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో భాగంగా జిల్లాలో ఐదు పర్యాయాలు భూములు ముంపునకు గురయ్యాయి. ఈ క్రమంలో ఇది మౌలికంగా భూ పోరాటం అని.. అనుబంధంగా నీటి పోరాటం అని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ, పాలమూరు అధ్యయన వేదిక బాధ్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అంటే ఏదుల–డిండి లింక్‌కు సంబంధించిన టన్నెళ్లు, స్ట్రక్చర్లు, కాల్వలను ముట్టుకోవద్దని. ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కావాలంటే మొత్తం పని వేరే చేయాల్సిందేనని అంటున్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement