● ధరణి ఆపరేటర్‌ను తొలగిస్తూ
కలెక్టర్ ఉత్తర్వులు
ఉప్పునుంతల: మండలంలోని అయ్యవారిపల్లి శివారు సర్వే నం.115లో దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే 13.17 ఎకరాల భూమిని సంబంధం లేని వ్యక్తులపై అక్రమంగా బదలాయించిన వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు ఉచ్చు బిగుస్తుంది. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారుల భూ మాయాజాలంపై గత నెల 14న ‘సాక్షి’లో ‘ఇదెక్కడి న్యాయం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. ప్రాథమిక విచారణలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు వెల్లడి కావడంతో ఈ విషయాన్ని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల ఉప్పునుంతల తహసీల్దార్ అద్దంకి సునీతను సస్పెండ్ చేసిన ఆయన శుక్రవారం ధరణి ఆపరేటర్ రాజ్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారని నూతన తహసీల్దార్ స్వప్న వెల్లడించారు. భూ అక్రమ బదలాయింపులో మరికొందరి అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకపక్క బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా భూమిని తన పేరిట మార్పు చేయించుకున్న వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ భూ అక్రమ బదలాయింపులో జరుగుతున్న విచారణలో అవకతవకలు వెల్లడి కావడంతోపాటు రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తుండటంతో మున్ముందు ఎంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
గత నెల 14న ‘సాక్షి’లో
ప్రచురితమైన కథనం


