గాడినపడని జీ‘వి‘తాలు! | - | Sakshi
Sakshi News home page

గాడినపడని జీ‘వి‘తాలు!

Oct 30 2026 2:21 AM | Updated on Oct 30 2026 2:21 AM

కందనూలు: గ్రామ పంచాయతీ మల్టీపర్పస్‌ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఉదయం లేచింది మొదలు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించడం.. మురుగు కాల్వలను శుభ్రం చేయడం.. మొక్కల సంరక్షణ.. దోమల నివారణ చర్యలు.. తాగునీటి నిర్వహణ.. ఇలా గ్రామాల్లో అన్నీ తామై పనిచేస్తున్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని జీతాలతోనే నెట్టుకొస్తున్నారు. తమకు కనీస వేతనాలు లేకపోగా.. ఉద్యోగ భద్రత కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి.. పెన్షన్‌, బీమా సౌకర్యం కల్పించాలని ఏళ్లుగా ప్రభుత్వాలకు విన్నవించుకున్నా అమలుకు నోచుకోవడం లేదని వాపోతున్నారు.

శ్రమకు తగిన గుర్తింపు కరువు..

జిల్లాలో 460 గ్రామ పంచాయతీలు ఉండగా.. అందులో కేవలం 1,814 మంది మాత్రమే మల్టీపర్పస్‌ వర్కర్లుగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన 500 మందికి ఒకరి చొప్పున ప్రతి జీపీలో ఇద్దరికి తగ్గకుండా నియమించారు. గ్రామాల్లో వీధులను శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం వంటి పనులను పారిశుద్ధ్య కార్మికులు నిత్యం నిర్వహిస్తున్నారు. ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాల పరిశుభ్రత కోసం శ్రమిస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తమవంతు కృషి చేస్తుండగా.. ప్రభుత్వం తమ సేవలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలీచాలని జీతాలు..

పారిశుద్ధ్య కార్మికులకు గతం నుంచి కూడా పంచాయతీ నిధుల నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల నుంచి ఒక్కొక్కరికి నెలకు రూ. 9,500 చొప్పున ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సమయానికి జీతాలు చెల్లించక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు లేకపోలేదు. దీంతో తమ కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. లేబర్‌ చట్టం ప్రకారం ప్రతినెలా రూ. 26వేల చొప్పున వేతనం చెల్లించాలని, ప్రతినెలా జీతం నేరుగా తమ అకౌంట్లలో జమచేయాలని కోరుతున్నారు.

సరైన వసతులు కరువు..

మల్టీపర్పస్‌ పేరుతో పారిశుద్ధ్య కార్మికులతో అనేక రకాల పనులు చేయిస్తున్నారు. అయితే వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. చేతులకు గ్లౌస్‌లు, ఆయిల్‌ సబ్బులు, యూనిఫాం తదితర వస్తువులు అందజేయడం లేదు. కొన్ని గ్రామాల్లో మాత్రమే యూనిఫాంలు ఇచ్చి, మిగతా ఎలాంటి వస్తువులు ఇవ్వకపోవడంతో తరచుగా అనారోగ్యం బారిన పడు తున్నామని కార్మికులు గోడు వెలబోసుకుంటున్నారు.

ఉద్యోగ భద్రత లేని పంచాయతీ కార్మికులు

చాలీచాలని వేతనాలతో కుటుంబాల పోషణ

కనీస వేతనం అమలు చేయాలని వేడుకోలు

మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలి..

గ్రామ పంచాయతీ కార్మికులకు శాపంగా మారిన జీవోనం. 51 సవరించి, మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలి. కార్మికులకు విద్యుత్‌, ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ వంటి పనులు రాక ప్రమాదాలకు గురవుతున్నారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు శ్రమకు తగ్గిన వేతనాలు అందించాలి.

– బత్తుల వెంకటేశ్‌, పారిశుద్ధ్య కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు

కనీస వేతనం ఇవ్వాలి..

పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలి. అలాగే కార్మికులను రెగ్యులరైజ్‌ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికుల కుటుంబాలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– మిద్దె బాలమ్మ,

పారిశుద్ధ్య కార్మికురాలు, కోడేరు

వేతనాలు పెంచాలని విజ్ఞప్తి..

గ్రామాల పరిశుభ్రత కోసం నిరంతం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికుల జీవితాల్లోనూ ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement