తిమ్మాజిపేట: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాళ్లచెరువు తండా, మారేపల్లి, ఎదిరేపల్లి, ఇప్పలపల్లి, తుమ్మలకుంట తండా, చంద్రాయన్‌పల్లి తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి, బిజినేపల్లి మండలం వట్టెం గ్రామాల్లో సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాలల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం మారేపల్లి ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, టాయిలెట్స్ నిర్మాణాలకు అరబిందో కంపెనీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి, మెరుగైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రెండో స్థానంలో ఉందని.. ఈ ఏడాది మొదటి స్థానంలో వచ్చేలా ఉపాధ్యాయుల కృషి చేయాలని ఆయన సూచించారు. అలాగే పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లతో పాటు హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వివేక్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రామారెడ్డి, శ్రీనివాస్ బహదూర్, హెచ్‌ఎం ప్రేమలత, సర్పంచులు గోపాల్ నాయక్, రాజు నాయక్, శారద, నాయకులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాధవ్, మనోహర్, అజయ్, నాగ సాయిలు, తిరుపతిరెడ్డి, గోవిందు, సహదేవ్ శ్రీను, శంకర్ పాల్గొన్నారు.


