నాగర్‌కర్నూల్: జిల్లాలో వానాకాలం వరిసాగులో సన్న రకాలకే రైతులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దొడ్డు రకాలతో పోలిస్తే సన్న రకాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా 1,30,503.20 ఎకరాల్లో వరి సాగైనట్లు అంచనా. వీటిలో 1,13,675.20 ఎకరాల్లో సన్న రకాలు, 16,828 ఎకరాల్లో దొడ్డు రకాలను సాగుచేశారు. వరి విస్తీర్ణంలో సుమారు 87శాతం సన్న రకాలే ఉండటం విశేషం. అయితే జిల్లావ్యాప్తంగా 3,16,573 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు వాటి సాగుకు ఎక్కువ ప్రాధ్యానం ఇచ్చారు. ఇక మొదట్లో వేసిన వరిపంట కోతలు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి.
బిజినేపల్లిలో అత్యధికం..
మండలాల వారీగా వరిసాగు విస్తీర్ణం, ఉత్పత్తి అంచనాలను పరిశీలిస్తే.. బిజినేపల్లి మండలం ముందంజలో ఉంది. ఈ మండలంలో 18,768 ఎకరాల్లో వరిసాగు కాగా.. 45,143.40 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. నాగర్‌కర్నూల్ మండలంలో 13,404.20 ఎకరాలకు గాను 32,385.08 టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా. కల్వకుర్తిలో 9,978 ఎకరాలకు గాను 24,545.20 టన్నులు, తాడూరులో 9,267 ఎకరాలకు గాను 22,977.80 టన్నులు, తిమ్మాజిపేటలో 8,705 ఎకరాలకు గాను 20,972.60 టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా వేశారు.
మండలాల మధ్య వ్యత్యాసం..
వరిసాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మండలాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ మండలాలు అధిక ఉత్పత్తి అంచనాలతో ముందుండగా.. అమ్రాబాద్‌లో 273 ఎకరాల్లో మాత్రమే సాగైంది. పంటల సాగు విస్తీర్ణం, రకాల ఎంపిక ఆధారంగా మండలాల వారీగా దిగుబడి అంచనాల్లో తేడాలు నమోదయ్యాయి.
దిగుబడులపై ఆసక్తి..
వానాకాలం పంటల సాగు వివరాల ఆధారంగా వ్యవసాయశాఖ ఉత్పత్తిని అంచనా వేసింది. వాస్తవ దిగుబడి మాత్రం పంట కోతలు, ధాన్యం నాణ్యత, పంట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. జిల్లాలో సన్న రకాల సాగు అధికంగా ఉండటంతో మొత్తం ధాన్యం ఉత్పత్తిలోనూ వాటిదే కీలక వాటా కానుంది. పంట కోతలు పూర్తయ్యే కొద్దీ తుది దిగుబడుల వివరాలపై స్పష్టత రానుంది.
తాడూరులో సాగుచేసిన వరిపంట
రకం సాగు విస్తీర్ణం ఉత్పత్తి అంచనా
(ఎకరాలు) (మె.ట.)
సన్న రకాలు 1,13,675.20 2,72,820.48
దొడ్డు రకాలు 16,828.00 43,752.80
మొత్తం 1,30,503.20 3,16,573.28
సన్నరకమే సాగుచేశా..
ప్రభుత్వం అందించే బోనస్ కోసం సూచించిన సన్నరకం వరి విత్తనాలే సాగుచేశా. రెండు ఎకరాల్లో సాగుచేసిన పంట బాగానే ఉంది. దిగుబడి సైతం వస్తుందని నమ్మకం ఉంది. ధర అధికంగా ఉండటంతో సంతోషంగా ఉంది. – బాలస్వామి, రైతు, అల్లాపూర్
●
జిల్లాలో వరిసాగు విస్తీర్ణం ఇలా..
మూడు రకాలకే ప్రాధాన్యం..
ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాటిలో మూడు రకాలకే రైతులు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో బీపీటీ 5204 రకం విత్తనాలను 17,680 ఎకరాల్లో, తెలంగాణ సోన (ఆర్‌ఎన్‌ఆర్ 1504) రకం 64,298, కేఎన్‌ఎం 1638 రకం 25,049 ఎకరాల్లో సాగుచేయగా.. కేఎన్‌ఎం 7715 రకం కేవలం కొన్ని మండలాల్లోనే 4,999 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. జైశ్రీరాం రకం 1,226 ఎకరాల్లో, హెచ్‌ఎంటీ సోనా 413 ఎకరాల్లో, డబ్ల్యూజీఎల్ 44 రకం విత్తనాలు కేవలం తాడూరు మండలంలో 10 ఎకరాల్లో సాగు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం బోనస్ ఇవ్వని ఇతర రకాల విత్తనాలను సైతం సాగు చేశారు.
జిల్లావ్యాప్తంగా 1.30 లక్షల ఎకరాల్లో వరిసాగు
అత్యధికంగా 1,13,675 ఎకరాల్లో సన్న రకాలు
2,72,820 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
16,828 ఎకరాల్లో మాత్రమే దొడ్డు రకాలు


