వివిధ స్థాయిల్లో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
● అర్హులకు ప్రయోజనం చేకూర్చేలా వేగంగా ప్రక్రియ
● మూడేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరుపై కొరవడిన స్పష్టత
● పండుగ ముందు ఆశలు రేపి.. ఆ తర్వాత నిరాశ
● కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
నెరవేరని
ఎన్నికల హామీ..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇతర పింఛన్లు కూడా పెంచుతామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచకపోవడంపై అర్హులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలోనూ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ దరఖాస్తుల పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరువు పరిస్థితుల్లో పింఛన్లు మంజూరు కాకపోవడంతో కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధాప్య
పింఛన్లు ఏవి..?
రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కొత్త పింఛన్ల మంజూరులో వృద్ధులకు, బీడీ కార్మికులు, ట్రాన్స్‌జెండర్లకు అవకాశం ఇవ్వలేదు. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, డయాలసిస్‌లకు మాత్రమే కొత్త పింఛన్లలో అవకాశం కల్పించింది. వృద్ధుల విషయానికి వస్తే.. గత ప్రభుత్వం వయోపరిమితిని 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించడమే కారణంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో అర్హత ఉన్న వృద్ధులు సైతం పింఛన్ల మంజూరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అచ్చంపేట: చేయూత పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగంగా కొనసాగుతుంది. కొత్త పింఛన్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. అర్హుల ఎంపికకు గ్రామానికో ప్రత్యేక అధికారిని నియమించి పరిశీలన చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రక్రియలో జిల్లావ్యాప్తంగా మొత్తం 14,324 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దరఖాస్తులను ట్యాగింగ్ చేసి ప్రాసెస్ చేసి.. 12,429 మందిని అర్హులుగా తేల్చారు. క్షేత్రస్థాయిలో అర్హత పరిశీలనతోపాటు ఎంపీడీఓల స్థాయిలో ఆమోద ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు త్వరగా అందేలా అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తున్నా వేలాది మంది పేదలు కళ్లు కాయలు కాసేలా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు మంజూరు చేయడంతోపాటు.. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచుతామని ఇచ్చిన హామీ ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా కొత్త పింఛన్లపై ఎలాంటి స్పష్టత లేకపోవడతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 2, ఆగస్టు 15, దసరా పండుగ.. ఇలా ఏ పండుగ వచ్చినా కొత్త పింఛన్లు వస్తాయని ఆశగా ఎదురుచూడటం, ఆ తర్వాత నిరాశ చెందడం లబ్ధిదారులకు పరిపాటిగా మారింది.
12 వేలకుపైగా అర్హత..
ప్రభుత్వం చేయూత కొత్త పింఛన్లకు కసరత్తు ముమ్మరం చేసింది. దరఖాస్తులను వడబోసి అర్హులను ఎంపిక చేస్తోంది. వెరిఫికేషన్‌లో అర్హత పొందిన దరఖాస్తుల్లోనూ తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఎంపీడీఓ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేస్తున్నా ఇంకా పెండింగ్‌లో చాలా ఉన్నాయి. దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియ ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ.. అసలు కొత్త పింఛన్ల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే పింఛన్లలో వృద్ధులకు అవకాశం కల్పించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,04,197 చేయూత పింఛన్లు అందుతుండగా, కొత్తగా వీఓల స్థాయిలో జరిగిన క్షేత్ర పరిశీలనలో 12,429 దరఖాస్తులు అర్హమైనవిగా తేలాయి. మరో 1,895 దరఖాస్తులు అనర్హమైనవిగా గుర్తించారు.


