జూన్ 1 నుంచి..
జాతీయ కరువు నిర్వహణ మాన్యువల్– 2016 (డిసెంబర్ 2020 వరకు నవీకరించిన మార్గదర్శకాలు) ప్రకారం ప్రభుత్వం మండలాల వారీగా కరువు పరిస్థితులను అంచనా వేసింది. ఇందులో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నమోదైన స్వయంచాలక వర్షపాత గణాంకాలు, వర్షాభావ కాలవ్యవధి వివరాలను పరిశీలించింది. వ్యవసాయ సాగు విస్తీర్ణంలో లోటు, ఉపగ్రహ ఆధారిత వృక్షసంపద పరిస్థితి, నేలలో తేమ వంటి ప్రభావ సూచికలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కరువు ప్రభావిత మండలాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన భౌతిక, ఆర్థిక వనరుల వివరాలతో కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన వన, పశు సంవర్ధక శాఖల అధికారులను ఆదేశించింది. కేంద్రం నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద సహాయం కోరేందుకు అవసరమైన నివేదికలను సిద్ధం చేసి పంపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నారాయణపేట: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరులో 63 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 3ను విడుదల చేసింది. ఎల్‌నినో ప్రభావం, నైరుతి రుతుపవనాల సమయంలో నమోదైన వర్షపాత లోటు, పంటల కీలక ఎదుగుదల దశల్లో నెలకొన్న దీర్ఘకాలిక పొడి వాతావరణం, నేలలో తేమశాతం తగ్గిపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొన్నింటిని తీవ్ర, మరికొన్ని మధ్యస్థ ప్రభావిత మండలాలుగా గుర్తించింది. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కలిపి మొత్తం 63 కరువు మండలాలుగా ప్రకటించింది. ఇందులో 44 మండలాలు తీవ్ర కరువు ప్రభావిత, 19 మధ్యస్థ కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది.
ఉమ్మడి జిల్లాలో 63 మండలాలను ప్రకటించిన ప్రభుత్వం
44 మండలాల్లో తీవ్రం.. 19 చోట్ల మధ్యస్థ కరువు
వర్షాభావం, నేలలో తగ్గిన తేమతో పంటలకు ముప్పు


