అచ్చంపేట రూరల్: ఎల్‌నినో పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఓటు బచావో– దేశ్ బచావోపై సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్ర దాస్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సర్ ఇన్చార్జి సిద్దేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ స్థితిని గమనించి సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తూ సమీక్ష చేసి కరువు మండలాలుగా ప్రకటించి వారిని ఆదుకోవాలని చూస్తున్నారన్నారు. రాబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


