నిబంధనలు అతిక్రమిస్తే వేటు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే వేటు

Oct 28 2026 1:18 AM | Updated on Oct 28 2026 1:18 AM

కల్వకుర్తి రూరల్‌: ఎన్నో కేసులు సక్సెస్‌ చేశామంటూ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యం చేయించుకునే ప్రకటనలకు జాతీయ వైద్య మండలి చెక్‌ పెట్టింది. కొంతమంది కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు రోగులను ఆకట్టుకునేందుకు చికిత్స చేయించుకున్న వారి అనుభవాలతో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వివిధ స్పెషలిస్ట్‌ వైద్యులు తాము చేసిన చికిత్స విజయాలను చెప్పుకొంటూ పరోక్షంగా ప్రకటనలు గుప్పిస్తుంటారు. మరి కొంతమంది రోగులకు సర్జరీ చేయకముందు.. సర్జరీ చేసిన తర్వాత ఎలా ఉంటారో చూపేందుకు తమ క్లినిక్‌, నర్సింగ్‌ హోంలలో పెద్ద పెద్ద అక్షరాలు, బొమ్మలతో ప్రచారం చేసుకుంటారు. ఆర్థోపెడిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీ, స్కిన్‌ తదితర క్లినిక్‌లలో ప్రచారం చేసుకోవడానికి ఇదొక మార్గంగా ఎంచుకుంటారు. ఇక నుంచి ఇలాంటి వాటికి ప్రైవేట్‌ వైద్యులు దూరంగా ఉండాల్సిందే. ఈ మేరకు జాతీయ వైద్య మండలి అనవసరమైన ప్రకటనలు నిషేధిస్తూ ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు ఆదేశించింది. అయితే జిల్లాలో 211 ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నట్లు వైద్య శాఖ లెక్కలు చెబుతుండగా.. దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇలాంటి ప్రకటనలే దర్శనమిస్తుంటాయి.

జిల్లాలో పెద్దఎత్తున ప్రచారాలు..

హైదరాబాద్‌కు చెందిన ఓ బడా కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యులు ఇటీవల కల్వకుర్తిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి తమ ఆస్పత్రిలో ఫలానా వైద్యుడు చేసిన వైద్యం విజయవంతమైందని చెప్పుకొచ్చారు. అదే ఆస్పత్రి యాజమాన్యం జిల్లాకేంద్రంలో రెండుసార్లు సమావేశాలు నిర్వహించి తమ ఆస్పత్రి, వైద్యుల ఘనతను వెల్లడించారు. అలాగే కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్‌ విజయవంతం అయిందని ప్రచారం చేపట్టారు. కల్వకుర్తిలోనే మరో ఆస్పత్రి నిర్వాహకులు తమ ఘనతను వివరిస్తూ ప్రచారం చేశారు. అచ్చంపేట ప్రాంతంలోనూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి తాము నిర్వహించిన ఆపరేషన్‌ ద్వారా కణతి తొలగించామని ప్రచారం చేసుకున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా కొంతమంది వైద్యులు ప్రతినిత్యం సామాజిక మాధ్యమాల్లో డయాబెటిస్‌, బీపీ, ఇతర వ్యాధుల నివారణ, జాగ్రత్తలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

అతిక్రమిస్తే అంతే..

ఎన్‌ఎంసీ నిబంధనలను ఉల్లంఘించే వైద్యులపై చర్యలు తప్పవు. మొదటిసారి ఉల్లంఘిస్తే హెచ్చరికతోపాటు తప్పనిసరి నైతిక శిక్షణ పొందాల్సి ఉంటుంది. రెండోసారి మందలింపుతోపాటు జరిమానా విధిస్తారు. మూడోసారి అయితే 3 నెలల నుంచి 6 నెలలు రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌ చేస్తారు. తప్పుదోవ పట్టించే చికిత్స హామీలు, రోగులకు ప్రోత్సాహకాలు, భారీ స్థాయిలో డిజిటల్‌ తప్పుడు ప్రచారాలు చేసినట్లు రుజువు అయితే 6 నుంచి 12 నెలలు సస్పెన్షన్‌ విధించే అవకాశం ఉంది. పదేపదే ఉల్లంఘిస్తే ఏడాది నుంచి మూడేళ్లపాటు వైద్య రిజిస్టర్‌ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవచ్చు.

ప్రైవేటు ఆస్పత్రుల ప్రకటనలపై జాతీయ వైద్య మండలి ఆంక్షలు

అధికారికంగా రాలేదు..

ఇటీవల జాతీయ వైద్య మండలి నూతన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసింది. కాగా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ నుంచి తమకు అధికారికంగా స్పష్టమైన ఆదేశాలు అందలేదు. ఆదేశాలు అందిన వెంటనే నిబంధనలను పరిశీలించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. – కృష్ణ, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement