కారిడార్‌పై ఆశలు.. | - | Sakshi
Sakshi News home page

కారిడార్‌పై ఆశలు..

Sep 20 2026 1:15 AM | Updated on Sep 20 2026 1:15 AM

నాలుగు లేన్లుగా మారనున్న 54.91 కి.మీ., నల్లమల రహదారి డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు..

బ్రాహ్మణపల్లి– పాతాళగంగ 45.19 కి.మీ., ఎలివేటేడ్‌ కారిడార్‌

క్షేత్రస్థాయి పరిశీలన చేసిన వైల్డ్‌లైఫ్‌, ఎన్‌హెచ్‌ఏఐ బృందం

నిర్మాణ పర్యవేక్షణ బాధ్యత

మోర్త్‌ నుంచి జాతీయ రహదారికి బదలాయింపు

బ్రాహ్మణపల్లి– పాతాళగంగ ఎలివేటెడ్‌ కారిడార్‌ ఆరు లేన్ల నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. అమ్రాబాద్‌, పదర మండలాలతోపాటు మద్దిమడుగు వచ్చిపోయే యాత్రికుల సౌకర్యం కోసం మన్ననూర్‌ దగ్గర ఎక్కి దిగ్గేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే యాత్రికులకు రెండు గంటల సమయం తగ్గుతుంది.

– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట

అచ్చంపేట: నల్లమల అభయారణ్యం మీదుగా ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్‌కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కారిడార్‌ నిర్మాణం ఆరు వరుసలుగా ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని, దీనికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సూచనప్రాయంగా అంగీకరించారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ మల్లురవి నల్లమల పర్యటనలో వెల్లడించడంతో కారిడార్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. నల్లమల గుండా జాతీయ రహదారి–765 ఉండటంతో వాహనాల రాకపోకల వల్ల వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. తరుచుగా వాహనాల కిందపడి పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని కారిడార్‌ నిర్మాణమే సరైన మార్గం అని అటవీశాఖ సైతం ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు అటవీశాఖ, వన్యప్రాణి బోర్డు (వైల్డ్‌లైఫ్‌) ఈ కారిడార్‌ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. కారిడార్‌ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో జాతీయ వన్యప్రాణి బోర్డు (వైల్డ్‌లైఫ్‌), ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది.

నాలుగు లేదా ఆరు వరుసలు

ఈ ప్రాజెక్టును కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌) నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు బదలాయించింది. దీంతో బ్రాహ్మణపల్లి (మన్ననూర్‌)– పాతాళగంగ(శ్రీశైలం) మధ్య 54.91 కి.మీ., ఎలివేటెడ్‌ కారిడార్‌కు చకచకా అడుగులు పడుతున్నాయి. మొదటగా రెండు లేన్లుగా నిర్మించాలని భావించినా.. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా నాలుగు లేదా ఆరు లేన్లుగా నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తే ఆశించిన స్థాయిలో ఆర్థిక సామర్థ్యం ఉండదని గతంలో కేంద్రం తెలియజేయగా.. ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఆర్థిక సామర్థ్యం చూడకూడదన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కారిడార్‌ నిర్మాణంలో 33 శాతం వాటా భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. అలాగే నిర్మాణ రంగంపై విధించే జీఎస్టీ కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ కారిడార్‌ నిర్మాణంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గం సుగమం కావడంతోపాటు ఏపీ వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement