శాసీ్త్రయ విధానాలతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ విధానాలతో అధిక లాభాలు

Sep 20 2026 1:15 AM | Updated on Sep 20 2026 1:15 AM

కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో

కిసాన్‌ మేళా విజయవంతం

కందనూలు: సాంకేతికతను అందిపుచ్చుకొని శాసీ్త్రయ విధానంలో పంటలు సాగు చేస్తే ఖర్చులు తగ్గి.. అధిక లాభాలు ఆర్జించవచ్చని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. శనివారం పాలెంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్‌ మేళా, రైతు, శాస్త్రవేత్తల సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యుడు ఏవీఎన్‌ రెడ్డితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను వారు పరిశీలించారు. వివిధ పంటల సాగు విధానాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యంత్ర పరికరాలు, పంటల సంరక్షణ చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంటల సాగుకు ముందు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకొని భూసారానికి అనుగుణంగా ఎరువులను వినియోగించాలని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న రబీ సీజన్‌లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలు, పంటల వైవిధ్యీకరణపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని కోరారు. అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల సాగు ఖర్చులు పెరగడంతోపాటు నేల సారవంతం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో ఎరువులు, పురుగు మందులను వినియోగిస్తూ సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించాలన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు సూక్ష్మ సాగునీటి, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులు, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు కేవలం పంటల ఉత్పత్తిపైనే కాకుండా నాణ్యత, నిల్వ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ అంశాలపై కూడా దృష్టిసారించాలని చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయడం, రైతు సమూహాలుగా ఏర్పడి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement