బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు

Sep 20 2026 1:15 AM | Updated on Sep 20 2026 1:15 AM

కందనూలు: బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్‌ అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి కోర్టు కోఆర్డినేషన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులు, కోర్టులో విచారణలో ఉన్న కేసుల పురోగతి, కోర్టు వ్యవహారాలపై చర్చించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలపై అక్రమాలు, సైబర్‌ నేరాలు తీవ్రమైన నేరాల్లో శాసీ్త్రయ ఫోరెన్సిక్‌ సాక్ష్యాధారాలతో నిర్ణీత గడువులోగా కోర్టులో చార్జిషీట్‌ సమర్పించాలని, తద్వారా నేరస్తులకు తగిన శిక్ష పడేలా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, కోర్టు లైజన్‌ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని, నిందితులపై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను వేగంగా అమలు చేసి, సమయానికి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు శ్రీనివాసులు, సాయి వెంకట్‌రెడ్డి, సీఐలు అశోక్‌రెడ్డి, శంకర్‌, ఎస్‌ఐలు వెంకట్‌రెడ్డి, రమేష్‌, రాములు, అభిషేక్‌రెడ్డి, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

భాషా నైపుణ్యాలు

పెంపొందించాలి

కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధనతోపాటు వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉపాధ్యాయ పండిత పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతోపాటు వారిలో మంచి ఆలోచనా విధానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలన్నారు. విద్యార్థుల్లో భాషపై ఆసక్తి, అభిరుచి పెంపొందించేలా బోధనా పద్ధతులను మరింత సరళంగా, ఆకర్షణీయంగా రూపొందించాలని సూచించారు. కేవలం మార్కుల సాధనకే విద్య పరిమితం కాకుండా.. మంచి విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచన, సామాజిక స్పృహ కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సునేంద్ర, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, డీఈఓ రమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

శనేశ్వరుడికి పూజలు

కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్‌ గ్రామంలో వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచేత శని గ్రహదోష నివారణకు స్వామివారికి తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. ప్రతిఒక్కరు జన్మ, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలన్నారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్‌ గోపాల్‌రావు, సర్పంచ్‌ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement