రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
కృష్ణా బేసిన్ పరిధిలో..
● ఈ నెలాఖరుకు
డీపీఆర్ రూపొందించేలా చర్యలు
● ముమ్మరంగా కొనసాగుతున్న
సర్వే సవరణ పనులు
● తాజాగా భూ సేకరణ కోసం
రూ.169 కోట్లు విడుదల
● ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు
తీరనున్న సాగునీటి కష్టాలు
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రూ.165 కోట్లు విడుదల చేయగా.. రూ.15 కోట్లతో ఇన్వెస్టిగేషన్, డీపీఆర్ తయారీ, మిగిలిన రూ.150 కోట్లతో భూసేకరణ చేపట్టనున్నాం. డీపీఆర్ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం క్షేత్రస్థాయిలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేసి నిర్మాణ పనులు చేపడుతాం.
– కేశవరావు, ఎస్‌ఈ, జూరాల
గద్వాల: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 9 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్‌లో ఆయా ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టుకు ఎలాంటి నీటి ఇబ్బందులు తలెత్తవు. కానీ, ఇదే ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్‌లో మాత్రం నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. ఈ నెలాఖరుకు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. తాజాగా భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం రూ.169 కోట్లు విడుదల చేయడంతో ఆయా పనులు మరింత ఊపందుకోనున్నాయి.
120 రోజులపాటు వరద..
గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా.. 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చే సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకొనే వెసులుబాట లభిస్తుంది.
తొలి ప్రాజెక్టు జూరాలే..
కృష్ణా బేసిన్‌లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ఇందిరా ప్రియదర్శిని జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసుకోవడం వంటివి సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. అయినప్పటికీ ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఫలితంగా రబీ సీజన్‌లో ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు సైతం పనులు మొదలయ్యాయి.
ప్రభుత్వ నిబంధనల మేరకు..
గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు పెంచినందున ఇందుకు సంబంధించి 1,100 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం రూ.165 కోట్లు విడుదల చేసింది. ముందుగా రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే భూములను గుర్తించి సర్వే చేపడుతారు. ఆ వెంటనే గ్రామసభ నిర్వహించి రైతుల వద్ద ఆమోదయోగ్యమైన ఒప్పందం చేసుకుంటారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయించిన ధర మేరకు పరిహారాన్ని రైతులకు చెల్లిస్తారు.
సర్వే, డీపీఆర్ రూపకల్పనకు వెచ్చించే నిధులు రూ.15 కోట్లు
కృష్ణా బేసిన్ పరిధిలో నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా 2 లక్షలు, కల్వకుర్తి 3.65 లక్షలు, కోయిల్‌సాగర్ 30 వేలు, జూరాల 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఏటా సుమారు 6.50– 7 లక్షల ఎకరాల వరకు సాగవుతుంది. ఇందులో 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ సీజన్‌లో సాగునీటికి ఎలాంటి ఢోకా లేదు. కానీ, యాసంగి సీజన్‌లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంటుంది. ఇందుకు ఈసారి రబీలో జూరాల కింద ఎడమ కాల్వ పరిధిలోని క్రాప్ హాలిడే ప్రకటించడమే నిదర్శనం.


