నాగర్‌కర్నూల్: జిల్లాలో సర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పకడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు అక్టోబర్ 7, తుది ఓటర్ల జాబితా నవంబర్ 9న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. గడువు పొడిగించినందున రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి మరింత సమన్వయంతో పనిచేసి సర్ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చొరవ తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,15,824 నోటీసులు జారీ చేయగా, కేవలం 329 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, హియరింగ్‌కు హాజరు కావాల్సిన 47,236 మందిలో ఇప్పటివరకు సుమారు 40 శాతం మందికి విచారణ పూర్తయిందని పేర్కొన్నారు. విచారణకు హాజరుకాని సుమారు 25 వేల మందికి మరో అవకాశం కల్పిస్తున్నామని, ఈ నెల 20లోగా అన్నింటినీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్నికల డీటీ కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాటం చిరస్మరణీయం
కందనూలు: చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలు అని, అన్యాయం, దోపిడి, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన తెగువ, పోరాట పటిమ, ఆత్మవిశ్వాసం సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటయ్య, బీసీ సంక్షేమ సహాయ అధికారి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


