కల్వకుర్తి రూరల్: భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు. గురువారం పట్టణంలోని తిలక్‌నగర్‌కాలనీలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భవనంలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 27 లక్షల మంది నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు నిధులను పాలక ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. హెల్త్ టెస్ట్‌ల పేరుతో రూ.450 కోట్లు, ట్రెయినింగ్ సెంటర్ పేరుతో మరో రూ.300 కోట్లు, కార్మికుల పిల్లలకు ఐటీ ఉద్యోగాల పేరుతో దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. 60 ఏళ్లు నిండిన భవన కార్మికులకు రూ.9 వేల పింఛన్ ఇవ్వాలని, వారి పిల్లల చదువులకు స్కాలర్‌షిప్ మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 25న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


