కందనూలు: ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన తప్పనిసరిగా ఉండాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆయన కార్యాలయంలో నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతి గర్భవతికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చిన వారికి క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందుల వాడకంపై అవగాహన కల్పించాలని చెప్పారు. తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా సిబ్బంది కృషిచేయాలని సూచించారు. హైరిస్క్ గ్రూపులైన ఆటో, లారీ, ట్రక్ డ్రైవర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని, అవసరమైన వారికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు.
శాంతియుతంగా
జరుపుకోవాలి
కందనూలు: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. నిర్వాహకులు వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడానికి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని, ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, కమిషనర్ నాగిరెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
కందనూలు: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం త్రైమాసిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను తీసి.. అక్కడ భద్రపరిచిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రితోపాటు భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి భద్రతకు నిర్దేశిత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.


