ఉప్పునుంతల: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)ను గురువారం పాలెం వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం సందర్శించింది. పీఏసీఎస్ ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో ఇటీవల రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన వేరుశనగ డికార్డికేటర్‌ను శాస్త్రవేత్తల బృందం పరిశీలించి.. వేరుశనగ పంట సాగుపై ఆరాతీశారు. మండలంలో ఎంపిక చేసిన ప్రగతిశీల రైతులకు వేరుశనగ బ్రీడర్ విత్తనాలను ఇచ్చి వారు పండించిన పంటను పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు కొనుగోలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పంట సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తామని వివరించారు. వేరుశనగ పంట సాగులో రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. శాస్త్రవేత్తల బృందంలో ఐసీఏఆర్ గుజరాత్ శాస్త్రవేత్త డాక్టర్ రుకంసింగ్ తోమర్, కర్ణాటక వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మమతశ్రీ, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త రాజమోహన్, పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు శిశిభూషన్, శోభ రాథోడ్ ఉన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, సీఈఓ రవీందర్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు.


