కందనూలు: జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మోడల్, కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, హెచ్‌ఎంలు (15 ఏళ్లు), ఉపాధ్యాయులు (పదేళ్లు) బోధనా అనుభవం గలవారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 1లోగా డీఈఓ కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాల కోసం అకడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్‌కుమార్ (90101 92288)ను సంప్రదించాలని సూచించారు.
రోడ్డు పనులు పూర్తిచేయాలి
వెల్దండ: మండలంలోని కొట్ర గేట్ వద్ద రోడ్డు నిర్మాణ పనులను జిల్లా రవాణ భద్రత శాఖ అధికారి శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 22 కిలోమీటర్ల బీటీరోడ్ల నిర్మాణానికి రూ.65 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కొట్రతండా నుంచి కల్వకుర్తి నాలుగు వరుసల రోడ్డు, కొట్ర గేట్ నుంచి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ వరకు చేపట్టిన రెండు వరుసల రహదారి, కల్వర్టుల నిర్మాణాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి.. బీటీరోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు ఆలస్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. రోడ్డు పనులు పూర్తయితే వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఈఈ వెంకటస్వామి, ఏఈలు సయ్యద్‌సోయద్దీన్, లక్ష్మీపతి తదితరులున్నారు.
నాణ్యమైన
విద్యుత్ సరఫరా చేయాలి
వెల్దండ: గ్రామాల్లో రైతులు, విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్‌శాఖ హైదరాబాద్ రూరల్ జోన్ ఇంజినీయర్ బాలస్వామి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ప్రజాబాటలో భాగంగా జిల్లా ఎస్సీ నరసింహారెడ్డితో కలిసి ఆయన వెల్దండ మండల కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సిబ్బంది చూడాలన్నారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కాలనీలు పెరిగిన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఈ శంకరయ్య, ఎస్‌ఏఓ పార్థసారథి, ఏఈ వెంకటేశ్వర్‌గౌడ్, సిబ్బంది అంకిత, లక్ష్మణ్‌నాయక్, యాదయ్య, లస్కర్, యాదగిరి, రామకృష్ణ , భాను, సికిందర్ తదితరులు ఉన్నారు.
మూలవిగ్రహాల ఫొటోలు తీయడం నిషేధం
అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో వెలసిన మూలమూర్తుల ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధించినట్లు ఆలయ ఈఓ దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి మూల విగ్రహాలతోపాటు అమ్మవారి ఆలయంలోని శ్రీచక్రం ఫొటోలు, వీడియోలు తీయరాదని చెప్పారు. ఇకపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగాంలలో రీల్స్ రూపంలో పోస్టు చేయరాదని పేర్కొన్నారు. మీడియాతోపాటు భక్తులు, ప్రజలు, ఆలయ అర్చక, సిబ్బంది ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించాలని ఆమె కోరారు.
30న కేంద్ర మంత్రి రాక
ఉండవెల్లి: జోగుళాంబ ఆలయ సందర్శన, జోగుళాంబ హాల్ట్ పర్యవేక్షణకు గాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం విచ్చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ముందుగా ఆదివారం సాయంత్రం రోడ్డు మార్గంలో అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ ప్రసాద్ స్కీం నిధులతో ఏర్పాటు చేస్తున్న లేజర్ లైట్‌ను వీక్షించి హరిత హోటల్‌లో బస చేస్తారన్నారు. అనంతరం సోమవారం జోగుళాంబ హాల్ట్ రైల్వేస్టేషన్ పనులను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీసి పర్యవేక్షిస్తారు. అనంతరం గద్వాలకు బయలుదేరి వెళ్తారు.


