కుస్తీ పట్టుతో
రెజ్లింగ్‌లో సత్తా చాటుతున్న పాలమూరు ఆడబిడ్డలు
● మట్టి బరిలో మొదలైన ప్రస్థానం.. జాతీయ వేదికపై పతకాల వేట
● అంతర్జాతీయస్థాయిలో బరిలోకి దూసుకెళ్లే లక్ష్యం..
ఒకప్పుడు కుస్తీ అంటే మగవాళ్ల క్రీడగానే చూసేవారు. కానీ ఇప్పుడు అదే మట్టిబరిలో పాలమూరు ఆడబిడ్డలు సవాల్ విసురుతున్నారు. తండాల నుంచి వచ్చిన ఈ బాలికలు.. చెమట చిందిస్తూ, పట్టుదలతో సాధన చేస్తూ జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన గీత, నాగలక్ష్మి, ప్రియమణి, బాలమణి, సీతామహాలక్ష్మి రెజ్లింగ్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. గీత వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు సిద్ధమవుతుండగా.. నాగలక్ష్మి ‘తెలంగాణ కేసరి’గా నిలిచింది. మిగిలిన క్రీడాకారిణులూ జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ భవిష్యత్తులో భారత జట్టు తరఫున అంతర్జాతీయ బరిలో దిగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
– మహబూబ్‌నగర్ క్రీడలు
చికర్లగడ్డతండాకు చెందిన ప్రియమణి ధన్వాడ కేజీబీవీలో ఇంటర్ చదువుతోంది. కొన్నేళ్లుగా రెజ్లింగ్‌లో శిక్షణ పొందుతున్న ఆమె జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2025లో మహారాష్ట్రలో జరిగిన అండర్–15 నేషనల్స్, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అండర్–17 ఎస్‌జీఎఫ్‌ఐ నేషనల్స్‌లో పాల్గొంది. ఈ ఏడాది మహారాష్ట్రలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లోనూ రాష్ట్ర జట్టు తరఫున బరిలోకి దిగింది. రెజ్లింగ్‌లో మరింత రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ప్రియమణి చెబుతోంది.


