అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 873.40 అడుగుల వద్ద 156.0124 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నీటి ప్రవాహం లేదు. దీంతో గురువారం 159.3828 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారు 3 టీఎంసీల నీటిమట్టం తగ్గినట్లయింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 35,315 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది.
కురుమూర్తిలో ఘనంగా పవిత్రోత్సవాలు
చిన్నచింతకుంట: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మాపురంలోని కురుమూర్తిస్వామి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ బ్రాహ్మణులు యజ్ఞ మండపంలో స్వామివారికి, అమ్మవారికి బ్రహ్మకలశం, అష్టోత్తర శతనామార్చన, కలశాభిషేకం తదితర పూజలను వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. అనంతరం పవిత్రారోపణ కార్యక్రమంలో భాగంగా పవిత్ర మాలలను ఆలయ చైర్మన్ బత్తుల బాలు యజ్ఞ మండపం నుంచి ప్రధాన ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామివారు, అమ్మవారు, ఆళ్వార్లు, ఉత్సవమూర్తులు, ద్వారపాలకులు, గరుడవాహనం, ధ్వజస్తంభం, బలిపీఠానికి పవిత్ర మాలలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
నేషనల్ ఫుట్‌బాల్
పోటీలకు రోహిత్
మహబూబ్‌నగర్ క్రీడలు: కర్ణాటక రాష్ట్రం బెంగళూర్‌లో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ ఫుట్‌బాల్ బీసీ రాయ్ ట్రోఫీలో జిల్లాకు చెందిన రోహిత్ మేఘావత్ ఎంపికై నట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌పీ వెంకటేశ్, భానుకిరణ్ తెలిపారు. 20 రో జులుగా హైదరాబాద్‌లో నిర్వహించిన సన్నాహక శిబిరంలో జిల్లా క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు.


