గణిత సామర్థ్యాల పెంపునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

గణిత సామర్థ్యాల పెంపునకు చర్యలు

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

కందనూలు: విద్యార్థుల్లో ప్రాథమిక భాషా, గణిత సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఈఓ రమేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్ఫీ పాయింట్లలో ఫొటో దిగి విద్యాశాఖ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను బలోపేతం చేయడం ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం పెంపొందించేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు తదుపరి తరగతుల్లో విద్యను సులభంగా అభ్యసించేందుకు ప్రాథమిక దశలోనే భాషా, గణిత సామర్థ్యాలు పటిష్టంగా ఉండటం ఎంతో అవసరమని, విద్యార్థుల వయస్సు, తరగతి స్థాయికి అనుగుణంగా నిర్దిష్ట అభ్యసన లక్ష్యాలను నిర్దేశించి, వాటిని సాధించేలా బోధనా ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు అక్షరాలను గుర్తించడం, పదాలను చదవడం, వాక్యాలను అర్థం చేసుకోవడం, తమ ఆలోచనలను వ్యక్తపరచడం వంటి భాషా సామర్థ్యాలతోపాటు సంఖ్యలను గుర్తించడం, లెక్కించడం, కూడిక, తీసివేత వంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రతి ప్రాథమిక పాఠశాల, కాంప్లెక్స్‌, మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించినట్లు డీఈఓ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement