పకడ్బందీగా పర్యవేక్షణ బాధ్యతలు..
● ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేల చొప్పున..
● గతేడాది కంటే రూ.10 వేలు అదనం
● పర్యవేక్షణ మరింత పటిష్టం
చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు
నర్వ: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పన, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ఎంఈఓలు, క్లస్టర్ జీహెచ్‌ఎంలకు అప్పగించి బాధ్యతలను మరింత పెంచింది. వీటి నిరంతర పర్యవేక్షణకు అవసరమైన నిధులను అంచనా వేసి అందుకు అనుగణంగా మంజూరు చేసింది. కొన్ని రోజులుగా నిధుల మంజూరు లేకపోవడంతో పర్యవేక్షణ కాస్తా తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు 2026–27 వార్షిక సంవత్సరానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1.59 కోట్లు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఎంఈలు, క్లస్టర్ జీహెచ్‌ఎంల పర్యవేక్షణ..
పాఠశాలల పర్యవేక్షణ ఎమ్మార్సీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఎంఈఓ నెలలో 20 పాఠశాలలని పర్యవేక్షించాలి. ఇందుకోసం ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఉమ్మడి జిల్లాకు రూ.70.20 లక్షలు మంజూరయ్యాయి. టీఎల్‌ఎం నిర్వహణ, పుస్తకాలు, దినపత్రికలకు రూ.20 వేలు.. స్టేషనరీ, నెట్ సౌకర్యం, ఆజదార్‌కిట్ వినియోగానికి రూ.25 వేలు, విద్యుత్ బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులకు రూ.20 వేలు వెచ్చించాల్సి ఉంది. ఖర్చులు పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి
జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 సీఆర్సీలు, 78 ఎంఆర్సీలు ఉన్నా యి. వీటి నిర్వహణకుగాను ప్రభుత్వం గతేడాది ఒక్కో సీఆర్సీకి రూ.33 వేలు అందించగా.. ఈ ఏడాది రూ.10 వేలు పెంచి రూ.43 వేల చొప్పున రూ.89.01 లక్షలు మంజూరు చేసింది.
నిధుల వినియోగం ఇలా..
రోజు పాఠశాలల పరిశీలన, రిపోర్టుల తయారీ, రిజిస్టర్లు, సమావేశాల నిర్వహణ, నెట్ సౌకర్యం, స్టేషనరీ, దినపత్రికల ఖర్చులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. నిర్వహణకు రూ.20 వేలు, టీఎల్‌ఎంకు రూ.10 వేలు, సమావేశాలకు రూ.3 వేలు, స్టేషనరీ, నెట్‌చార్జీల కోసం రూ.10 వేలు వెచ్చించాల్సి ఉంటుంది.
జిల్లాలో పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంఆర్సీలు, సీఆర్సీలకు మంజూరైన నిధులతో మరింత బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కో సీఆర్సీకి గతేడాది కంటే అదనంగా రూ.10 వేలు మంజూరయ్యాయి. క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించి బోధన నైపుణ్యాలు పెంచేలా సూచనలు అందిస్తున్నాం.
– విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట


