అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైన విద్య, వైద్యరంగాలను పూర్తిస్థాయిలో విస్మరించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. వీటిపై ఇప్పటికే అన్ని జిల్లాల కార్యదర్శులకు సమాచారం అందించామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చే యాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పాఠశాలల్లో కనీస వసతులను ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యరంగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అన్నిరకాల సేవలను అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు జీఎస్.గోపి, మండల కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేష్, అజయ్, శంకర్ పాల్గొన్నారు.


