గద్వాల/ అచ్చంపేట: ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో హైడల్ విద్యుత్ కేంద్రానికి 23,531 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్టు–1కు 1,300, లిఫ్టు–2 872, కోయిల్‌సాగర్‌కు 930, ప్రధాన ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 550, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 54,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.30 మీటర్ల వద్ద 9.214 టీఎంసీల నీరు ఉంది.
శ్రీశైలంలో స్పల్పంగా పెరిగిన నీటిమట్టం
శ్రీశైలం జలాశయంలోకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. జూరాల జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలానికి 23,531 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి విద్యుదుత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 7,063 క్యూసెక్కులు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్‌ఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 876 అడుగుల వద్ద 168.2670 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పార్టీని బలోపేతం చేయాలి
గద్వాల: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎంపీ మల్లురవి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత లోపాలు, కేడర్ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, రాజీవ్‌రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు తరలిన ఉద్యోగ, ఉపాధ్యాయులు
కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి అనే డిమాండ్‌తో సీపీఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ఆదివారం జిల్లాకేంద్రం నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షలకుపైగా ఉద్యోగులకు శాపంగా మారిన సీసీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కృషి ఫలితమే కేఎల్‌ఐ ప్రాజెక్టు
కొల్లాపూర్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే కేఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మితమైందని వైఎస్సార్‌సీపీ నందికొట్కూర్ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ అన్నారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామ శివారులో ఉన్న కేఎల్‌ఐ ప్రాజెక్టును పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేఎల్‌ఐ ప్రాజెక్టు వరప్రదాయిని అని పేర్కొన్నారు. ఐదేళ్ల వ్యవధిలోనే కేఎల్‌ఐ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేశారని గుర్తు చేశారు. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 3 లక్షలపైగా ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్, నాయకులు మధు, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


