● సిద్ధమవుతున్న మూడేళ్ల సమగ్ర
అభివృద్ధి ప్రణాళిక
● వందకుపైగా అంశాలపై వివరాలు
సేకరిస్తున్న కార్యదర్శులు
● గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సన్నాహాలు
అచ్చంపేట: గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ముందుకు తెచ్చింది. రాబోయే మూడేళ్లలో (2026–29) గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన, సామాజిక భద్రత, సుపరిపాలన అంశాలతో కూడిన తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీసీడీపీ) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దీనికోసం జిల్లాలో 461 గ్రామ పంచాయతీల వారీగా పూర్తి వివరాలను సేకరిస్తున్న కార్యదర్శులు విలేజ్ ప్రొపైల్‌ను సిద్ధం చేస్తున్నారు. అన్ని శాఖల నుంచి మొత్తం వందకుపైగా అంశాలను నివేదికలో నమోదు చేస్తున్నారు. పంచాయతీ పేరు మొదలుకొని ఊరి విస్తీర్ణం, వా ర్డులు, రేషన్‌కార్డులు, నివాసాలు, కుటుంబాలు, కులాల వారీగా జనాభా, గుడులు, బడులు, రోడ్లు, మహిళా సంఘాలు, రైతులు, అక్షరాస్యత శాతం, చే పట్టాల్సిన అభివృద్ధి పనులు తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
మరుగుదొడ్లు, సీసీరోడ్లు, తాగునీరు
గ్రామాల్లో మరుగుదొడ్లు అవసరమైన వారిని గుర్తించి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో మరుగుదొడ్డిని స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.12 వేలతో నిర్మించనున్నారు. అలాగే కమ్యూనిటీ టాయిలెట్ల సముదాయాలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. అదేవిధంగా తాగునీరు సరఫరా చేసేందుకు అంచనాలను సిద్ధం చేస్తున్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపులైన్‌ల విస్తరణతోపాటు నల్లా కనెక్షన్లు లేని ఇళ్లను గుర్తిస్తున్నారు. పాత చేతిపంపులు, మోటార్ల మరమ్మతు కోసం అవసరమైన అంచనాలను నివేదికలో చేరుస్తున్నారు. అలాగే అంతర్గత రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామాల మధ్య లింక్ రోడ్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. గ్రామాలు శుభ్రంగా కనిపించేలా డ్రెయినేజీల నిర్మాణం, వీధుల్లో ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల అవసరాలను గుర్తిస్తున్నారు. కాగా ఉపాధి హామీలో వన మహోత్సవం కింద అవెన్యూ ప్లాంటేషన్, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలపై వివరాలు సేకరిస్తున్నారు. మహిళా సంఘాలు, వారు తీసుకున్న రుణాలతో స్థాపించిన వ్యాపారాలను నివేదికలో పొందుపర్చుతున్నారు. గ్రామ సమగ్ర సమాచారం ప్రతి పౌరుడు సులభంగా తెలసుకునేలా ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన యాప్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.


