విధులకు రావొద్దని చెప్పాం..
విచారణ చేపడుతాం..
నాగర్‌కర్నూల్ మైనార్టీ గురుకులంలో తరచుగా వివాదాలు
కందనూలు: జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మా రింది. గురుకులంలో కొందరు ఒప్పంద ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు విద్యాలయానికి మా యని మచ్చగా మారుతోంది. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను గురుకులంలో చేర్పిస్తే.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏడో తరగతి విద్యార్థిని ఉర్దూ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన బుఽ దవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎనిమిదేళ్ల నుంచి ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న సదరు ఉపాధ్యాయుడు.. శుక్రవారం రాత్రి విద్యార్థి నిద్రిస్తున్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే ఆది, సోమవారం సెలవుదినాలు కావడంతో ఆ విద్యార్థి స్వగ్రామానికి వెళ్లి గురుకులంలో ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరును తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. మంగళవారం పా ఠశాలకు చేరుకున్న విద్యార్థి తండ్రి.. సదరు ఉపా ధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రిన్సిపల్ విద్యార్థి తండ్రికి నచ్చచెప్పి.. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కా కుండా చూస్తానని చెప్పి పంపించినట్లు తెలిసింది.
ఒప్పంద ఉద్యోగులదే పెత్తనం..
మైనార్టీ గురుకులంలో మొత్తం 430 విద్యార్థులు ఉండగా.. ఆరు నుంచి పదో తరగతి వరకు 340 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ విద్యార్థులు 90 మంది ఉన్నారు. మొత్తం 26 మంది ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో రెగ్యులర్ ఉపాధ్యాయులు 19 మంది, కాంట్రాక్టు ఉపాధ్యాయులు 7మంది ఉన్నారు. బోధనేతర సిబ్బంది మరో 15 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గురుకులంలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులు స్థానిక అధికార పార్టీ నాయకుల పలుకుబడిని ఉపయోగించి.. ప్రిన్సిపల్‌తో పాటు రెగ్యులర్ ఉపాధ్యాయులపై పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ ఏ పని చెప్పినా సదరు ఒప్పంద ఉద్యోగులు వినకపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు గట్టిగా చెబితే లేనిపోని ఆరోపణలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారని తెలిసింది.
పెచ్చుమీరిన రాజకీయ జోక్యం..
ఒప్పంద పద్ధతిలో పనిచేసే ఉద్యోగులు కొందరు తరచుగా పాఠశాలలో సమస్యలు సృష్టిస్తూ.. పాఠశాల తమదనే స్థాయిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని ఉన్నతాధికారులు ఎమన్నా అంటే.. వారు తమ రాజకీయ పలుకుబడితో ఎదిరించే స్ధాయికి చేరారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగి.. ఏకంగా ప్రిన్సిపల్ సస్పెన్షన్ అయ్యే స్థాయికి వెళ్లింది. కొన్ని రోజుల క్రితం పలువురు తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తే.. స్థానిక రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో తన తప్పు ఏమీ లేదని సదరు అధికారి ఉన్నతాధికారులతో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్‌తో పాటు, రెగ్యులర్ ఉపాధ్యాయులు కాంట్రాక్టు సిబ్బందిని ఏం అనలేని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.
గురుకుల విద్యాలయంలో ఉర్దూ బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థిపై వ్యవహరించిన అనుచిత ప్రవర్తనపై ఉన్నాతాధికారులకు సమాచారం అందించాం. వారి సూచన మేరకు అత డిని విధులకు రావొద్దని చెప్పాం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం.
– ఆనంద్‌గౌడ్, ప్రిన్సిపల్, మైనార్టీ గురుకులం, నాగర్‌కర్నూల్
మైనార్టీ గురుకుంలో జరిగిన ఘటనపై శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి విచారణ చేపడుతాం. వారు చెప్పిన అంశాల ఆధారంగా ఉన్నాతాధికారులకు నివేదిక అందిస్తాం. ప్రస్తుతం ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాం. పై అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం.
– కిరణ్మయి, ఆర్‌సీవో, మైనార్టీ గురుకులం
తాజాగా ఓ విద్యార్థితో ఉపాధ్యాయుడి
అనుచిత ప్రవర్తన
అధికారులను సైతం ఖాతరు చేయని ఒప్పంద ఉద్యోగులు
అధికార పార్టీ నాయకుల అండతో పెత్తనం
నిస్సాయ స్థితిలో ప్రిన్సిపల్,
ఉపాధ్యాయులు


